English | Telugu
బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలకు కొరత!
Updated : Mar 17, 2020
తెలంగాణలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు పడిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తలసేమియా బాధితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత కొద్ది రోజులుగా రక్తదానం చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. కరోనా భయంతో హాస్పిటల్స్, ఆరోగ్య శిబిరాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. గతంలో ఐటీ కంపెనీలు, కాలేజీల్లో రక్తదాన క్యాంపులు నిర్వహించి, రక్తం సేకరించేవారిమని, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వీటిని మూసివేయడంతో పూర్తిగా రక్త నిల్వలు తగ్గిపోయాయి.. దీని వల్ల ముఖ్యంగా చిన్నారులు, తలసేమియా బాధితులు ఇబ్బందులు పడుతున్నారని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర డాక్టర్ కేపీ రెడ్డి అన్నారు.
తెలంగాణా ప్రభుత్వం కరోనాపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా షట్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జనం బయటకు రావడం పూర్తిగా తగ్గిపోతోంది. ముఖ్యంగా హార్ట్ పేషంట్లకు సర్జరీలు చేయడానికి కూడా రక్తం అవసరం అయినప్పుడు దాతలు కరువైపోతున్నారని ఆసుపత్రుల నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు మొత్తం తెలంగాణాలోని ఇతర బ్లడ్ బ్యాంకుల్లో కూడా రక్తం నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.