English | Telugu

ఇండోనేషియా జ‌మాత్ క‌రీంన‌గ‌ర్‌లో ఎంత మందిని క‌లిసింది?

కరీంనగర్ సంఘ‌ట‌న‌తో తెలంగాణా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే రోజు 7 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం తెలంగాణా భయంతో వణికిపోతోంది. ఇండోనేసియా నుంచి వచ్చిన బృందం ఈ మహమ్మారిని కరీంనగర్‌కు తీసుకొచ్చింది.

మార్చి 13వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరిన త‌బ్లిక్ జ‌మాత్ కు చెందిన 10 మంది సభ్యుల బృందం మార్చి 14వ తేదీ ఉదయం రామగుండం చేరుకుంది. ఆ తర్వాత రోజు కరీంనగర్‌కు వచ్చింది. వారిలో ఏడుగురు వైరస్ బారిన పడ్డారు. దీంతో కరీంనగర్‌లో టెన్షన్‌ నెలకొంది. వైరస్ కేసులు బయటపడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. కరీంనగర్‌లో ఆంక్షలు విధించింది. ఇండోనేసియా బృందం కలెక్టరేట్‌కు సమీపంలోనే బసచేసింది. దీంతో మూడు కిలోమీటర్ల మేర ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. నగరంలో దుకాణాలు తెరుచుకోలేదు. పదో తరగతి పిల్లలు మాత్రమే రోడ్లపై కనిపిస్తున్నారు.

ఇండోనేసియా బృందం ఎవరెవరితో సన్నిహితంగా తిరిగారన్నది అధికారులు ఆరా తీస్తున్నారు. 8మంది వీరితో బాగా క్లోజ్‌గా ఉన్నట్లు గుర్తించారు. వారిని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఆ 8మంది ఎక్కడెక్కడ, ఎవరెవరితో తిరిగారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌కు వంద ప్రత్యేక వైద్య బృందాలను తరలించారు. వారు ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

క‌రీంన‌గ‌ర్ సంఘ‌ట‌న‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడో పెద్ద పరీక్ష ఎదురైంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా 13కు చేరుకున్నాయి. త‌బ్లిక్ జ‌మాత్ రోజు వారీ కార్య‌క్ర‌మాల్లో భాగంగా స్థానిక ముస్లింల‌లో ఇస్లాం గురించి బోధించ‌డానికి ముస్లిం ప్రాంతాల్లో తిరుగుతూ వుంటారు. ఇండోనేషియా నుంచి వ‌చ్చిన జ‌మాత్ ఢిల్లీ నుంచి నేరుగా క‌రీంన‌గ‌ర్ జిల్లాకు వ‌చ్చారు. వారికి గైడ్‌గా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి వ‌చ్చాడు. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో ఎస్ 9 బోగీలో వీరు ప్రయాణించారు. రామగుండం చేరుకున్న వారు తర్వాత కరీంనగర్ కు చేరుకున్నారు. మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా వచ్చిన వారిలో ఒకరికి మంగళవారం కరోనా పాజిటివ్ గా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఈ టీంలోని మిగిలిన పదిమందిని (తొమ్మిది మంది ఇండోనేషియా జాతీయులు.. మరొకరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు) తరలించి.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

తొలుత కరోనాను గుర్తించిన ఇండోనేషియా వాసి నిమోనియాతో బాధ పడుతున్నాడు. అతడ్ని వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఇండోనేషియా నుంచి ఢిల్లీ.. అక్కడ నుంచి రామగుండం.. ఆ తర్వాత కరీంనగర్ కు చేరుకున్న వారు ఎంతమందిని కలిశారు? ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు? అన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి రామగుండం వరకు ప్రయాణించిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ బోగీలో 82 మంది ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. వీరంతా ఇప్పుడెక్కడ ఉన్నారు? వారి ఆరోగ్యం ఎలా ఉంది? అన్న అంశాన్ని లెక్క తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.