English | Telugu
షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్.. వాయిదా వేసే ఆలోచన లేదు
Updated : Mar 15, 2020
కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ అన్ని జాగ్రత్తలతో టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జపాన్ ప్రధాని షింజో అబే స్పష్టం చేశారు. ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలా? లేదా రద్దు చేయాలా? అనేది డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సులకు అనుగుణంగానే ఉంటుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చెబుతుంటే.. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరుగుతుందని, ఈ విషయంలో ఐఒసితో కలిసి పనిచేస్తున్నామని ప్రధాని అన్నారు. ఇటీవల టోక్యో మెగా ఈవెంట్‌ను వాయిదా వేయాలనే ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా స్పందించారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో స్పోర్ట్స్ ఈవెంట్‌లు వాయిదా పడిన నేపథ్యంలో ఒలింపిక్స్‌ను సైతం రీ షెడ్యూల్ చేస్తే బాగుంటుందనే వాదన ఎక్కువైంది. ఈ క్రమంలోనే మాట్లాడిన జపాన్ ప్రధాని.. ఒలింపిక్స్ నిర్వహణ అనేది ఆలస్యం కావడం కానీ, వాయిదా పడటం కానీ జరగదన్నారు. షెడ్యూల్‌లో పేర్కొన్నట్లు జూన్ 24 నుంచే ఒలింపిక్స్ జరుగుతుందన్నారు. స్టేక్ హోల్డర్స్‌తో కూడా టచ్‌లో ఉన్నామన్నారు. కరోనా విజృంభణ, ఒలింపిక్స్ నిర్వహణ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు.
ఎలాంటి సమస్య లేకుండా షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తాం. ఒలింపిక్స్ వాయిదా లేదా రద్దు గురించి తాము ఆలోచించడం లేదు' అని టోక్యోలో అబే ప్రకటించారు.