English | Telugu
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్... సతమతమవుతోన్న లక్ష్మణ్...
Updated : Nov 20, 2019
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు, పాత లీడర్లకు అస్సలు పొసగడం లేదు. క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే బీజేపీలో ఈ పాత... కొత్త పంచాయతీ రాష్ట్ర నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ బలపడటానికి ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తూ, పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ... ఆ తర్వాత వాళ్లకు కీలక పదవులు కట్టబెట్టడంతోనే అసలు తంటా వస్తోంది. ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలను కోర్ కమిటీలోకి తీసుకోవడంపై పాత కాపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు వాళ్లకు ఏ అర్హతలున్నాయని కోర్ కమిటీలోకి తీసుకుంటున్నారని రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
జాతీయస్థాయిలోనైనా... రాష్ట్రస్థాయిలోనైనా... బీజేపీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా... కోర్ కమిటీ ఆమోదమే కీలకం. కోర్ కమిటీ తీసుకునే నిర్ణయాలకు నేతలంతా శిరసావహించాల్సిందే. అయితే, ఆ కోర్ కమిటీలోకి ఎవరి తీసుకోవాలనే విచాక్షణాధికారం పూర్తిగా ఆయా అధ్యక్షులకే ఉంటుంది. అయితే, అలాంటి కీలకమైన కోర్ కమిటీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను నేరుగా తీసుకోవడాన్ని పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి, పెద్దిరెడ్డి, పొంగులేని సుధాకర్ రెడ్డి, గరికపాటి, వివేక్... ఇలా పలువురికి కోర్ కమిటీలో చోటు కల్పించారు. అయితే, కీలకమైన కోర్ కమిటీలోకి కొత్తగా వచ్చినవారిని చేర్చుకుంటూపోతే... ఎప్పట్నుంచో పార్టీలో కొనసాగుతున్న సీనియర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న లీడర్లకు సైతం కీలక కమిటీల్లో చోటు కల్పించకుండా... ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లకు పెద్దపీట వేయడం సరికాదంటున్నారు.
అసలు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందని పొంగులేటి లాంటి లీడర్లను కూడా కోర్ కమిటీలోకి ఎలా తీసుకుంటారని రాష్ట్ర నాయకత్వాన్ని సీనియర్లు నిలదీస్తున్నారు. అయితే, ఈ పాత-కొత్త పంచాయతీతో తలపట్టుకుంటున్న టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్... ఇది తాత్కాలిక కమిటీ మాత్రమేనని, త్వరలో సీనియర్లతో చర్చించి, అందరికీ న్యాయం చేస్తామని బుజ్జగిస్తున్నారట. ముఖ్యంగా ధర్మారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి నేతలు... రాష్ట్ర నాయకత్వంపై మండిపడినట్లు తెలుస్తోంది. అయితే, లక్ష్మణ్ ఎంత ప్రయత్నించినా పాత-కొత్త వాళ్ల మధ్య అంతరాన్ని తగ్గించలేకపోతున్నారని... పాతవాళ్లను నొప్పించకుండా... కొత్తవారిని నిరుత్సాహపర్చకుండా... ఇద్దర్నీ ఏకతాటిపైకి తీసుకురావడం పెను సవాలుగా మారిందని అంటున్నారు.