English | Telugu

లోక్ సభలో ఇదే నినాదం... గాంధీ కుటుంబానికి భద్రత ఎందుకు తీసేసారు ?

గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఎత్తివేయడంపై లోక్ సభలో నిలదీశారు కాంగ్రెస్ పార్టీ అధినేత రంజన్ చౌదరి. ఎందుకు అకస్మాత్తుగా భద్రతను తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. గాంధీ ఫామిలీకి మాజీ ప్రధాని వాజ్ పేయి కూడా ఎస్పీజీ ద్వారా భద్రత కల్పించారని గుర్తు చేశారు. 1991 నుంచి 2019 వరకు రెండు సార్లు ఎన్డీయే అధికారం లోకి వచ్చిందని ఆ సమయంలో ఎప్పుడూ ఎస్పీజీ భద్రత తొలగించలేదన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ భద్రత తొలగింపుపై ప్రధాని మోదీ , హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్ లోకి దూసుకువెళ్లారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఆ తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఒంటరి గానే పార్లమెంటుకు వచ్చారు. ఆమెతో పాటు కారులో వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్ ను ఒకటో నెంబర్ గేటు వద్దే ఆపేశారు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగించిన తర్వాత సీఆర్పీఎఫ్ దళాలు వారికి సెక్యూరిటీని కల్పిస్తున్నాయి. అటు సోనియా గాంధీ కుటుంబ భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంచలన లేఖ రాసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అతని భార్య గురుషరణ్ కౌర్ ల భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందించాలని సీఆర్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు లేఖ రాసింది. ఈ నెల 8 వ తేదీన సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్ ప్లస్ కేటగిరి రక్షణ భద్రతలను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్పగించిన నేపథ్యంలో ఈ లేఖ రాసింది.

సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉన్నప్పుడు కేటాయించిన టాటా సఫారీ స్కార్పియో బుల్లెట్ ప్రూఫ్ కారులను వినియోగించేవారు. ఎస్పీజీ భద్రతను తొలగించడంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని కూడా ఎస్పీజీ ఉపసంహరించుకుంది. సోనియా గాంధీ కుటుంబానికి ఒక్కొక్కరికి వంద మంది సాయుధ కమాండోలతో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించిన నేపథ్యంలో బులెట్ ప్రూఫ్ వాహనాలని కూడా సత్వరం అందించాలనీ సీఆర్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ను కోరింది.