English | Telugu

మంత్రి వెలంపల్లిపై సి.ఎం. సీరియ‌స్‌

జ్యోతిషాలయం అడ్డాగా లైంగిక వేధింపులు
వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శి వంశీకృష్ణ రెడ్డి, అచ్చిరెడ్డి లీల‌ల‌పై సి.ఎం. ఆరా

కేవ‌లం రూపాయి తీసుకుని జోస్యం చెప్పడం మొదలెట్టి...'తాంత్రిక మంత్రాలు' అంటూ అల్లిబిల్లి సోది కబుర్లన్నీ చెప్పీ.. చెప్పి ఏకంగా ఓ డెబ్బై కోట్లు వెనుకేశాడట‌. ఆ మ‌హానుభావుడు ఎవ‌ర‌నుకుంటున్నారా? అదేనండి. కోనాల అచ్చిరెడ్డి. విజయవాడలోనే నివాసం. 'ఆంధ్రా, తెలంగాణ' అనే బేధం లేకుండా ఎంచక్కా మోసాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు కోనాల అచ్చిరెడ్డి భవానీపురంలో జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు.

కోనాల అచ్చిరెడ్డి, అత‌ని కొడుకు వంశీకృష్ణ రెడ్డికి మంత్రి ఆశీస్సులున్నాయి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు, వంశీకృష్ణ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడే కాదు. రైట్ హ్యాండ్ కూడా. వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శిగా మంత్రి ఆయ‌న‌కు ప‌ద‌వి కూడా ఇచ్చారు.

తండ్రీకొడుకులిద్దరూ కలిసి మహిళలను లైంగికంగా వేధించ‌డం వారికి అల‌వాటుగా మారింది. జాతకాల పేరుతో లక్షలాది రూపాయలు దండుకోవ‌డానికే దుకాణం పెట్టుకున్నారు. ప్రజల బలహీనతలే పునాదులుగా చేసుకొని కోట్ల రూపాయ‌లు సంపాదించారు. నమ్మి వచ్చే భక్తుల్ని దోచుకున్నారు. సాప్ట్ వేర్ కంపెనీలలో 'షేర్ ల‌లో పెట్టుబ‌డులు పెడ్తామంటూ లక్షల రూపాయ‌లు అమాయ‌కుల నుంచి కాజేశార‌ని స్థానిక పోలీసులకు ఫిర్యాదులూ అందాయి.

తెలంగాణ ఖమ్మంకు చెందిన ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టిస్తానంటూ రూ.50 లక్షల మేర మోసం చేసిన కేసులో వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శి కోనాల వంశీ కృష్ణారెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు.

వంశీ అధికార పార్టీ నాయకుడిగా ఉండటం, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు అనుచరుడిగా ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఆంధ్ర పోలీసులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడంతో పలువురు బాధితులు ఆంధ్రప్రదేశ్ పోలీసులపైనా ఒత్తిడి తెస్తున్నారు.

అస‌లు వివ‌రాల్లోకి వెళ్లితే, గ‌త ఏడాది తెలంగాణకు చెందిన ఓ మహిళ జ్యోతిషం చెప్పించుకునేందుకు భవానీపురంలోని జ్యోతిషాలయంకు వ‌చ్చి అచ్చిరెడ్డిని క‌లిసింది. ఆ సమయంలో అచ్చిరెడ్డి, ఆయన కుమారుడు తనతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టిస్తానని రూ.50 లక్షలు తీసుకున్నార‌ట‌. అంతే కాదు అబ్బా కొడుకులిద్ద‌రూ క‌లిసి ఆమెను లైంగికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించింది. ఇదే విషయంపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీసులను ఆశ్రయిస్తే వారు రాజకీయ ఒత్తిళ్లతో ఎలాంటి కేసులు నమోదు చేయలేదట‌.

మంత్రి అండ చూసుకొని వంశీ కృష్ణారెడ్డి ఆ మహిళను బెదిరించడం ప్రారంభించాడు. త‌న‌ వద్ద ఆమె నగ్న చిత్రాలు ఉన్నాయని బెదిరించడంతో బాధిత మహిళ ఏం చేయాలో పాలుపోక కొద్దిరోజుల క్రితం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అచ్చిరెడ్డి, ఆయన కుమారుడు వంశీ కృష్ణారెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు.

లైంగిక వేధింపులు, న‌గ్న ఫోటోలున్నాయ‌ని బెదిరించ‌డం, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకోవ‌డంతో పాటు ఆమె కారును కూడా లాక్కున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు.

భవానీపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని పాత ఎంఐజీ 123 బ్లాకులో జ్యోతిషాలయం నిర్వహించే అచ్చిరెడ్డి అదే బ్లాకులో ఉన్న ఆనం మోహన్‌ రెడ్డి, చెంచులక్ష్మి దంపతుల ఫ్లాటును కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఫ్లాటును మోహన్‌రెడ్డి రిటైర్డ్‌ వీఆర్వో ప్రకాశరావు నుంచి కొన్నారు. అచ్చిరెడ్డి బెదిరింపులకు భయపడే ప్రకాశరావు తన ఫ్లాటును మోహన్‌ రెడ్డికి అమ్ముకుని వెళ్లిపోయారు.

మోహన్‌ రెడ్డి కొన్నాక ఆయనకూ అచ్చిరెడ్డి నుంచి వేధింపులు తప్పలేదు. రూ.30 లక్షల విలువ చేసే ఫ్లాటును రూ.10 లక్షలకు తనకు విక్రయించాలని అచ్చిరెడ్డి వేధించ‌డం మొద‌లు పెట్టాడు. 'మంత్రి అనుచరులు' అంటూ కొందరు ఫోన్లు చేసి మోహన్‌ రెడ్డి దంపతులను బెదిరించారు. దీనిపై ఈ దంపతులు గత ఏడాది ఆగస్టు 19న స్పందనలో పోలీసులకు విజ్ఞప్తి చేసినా ఫ‌లితం లేద‌ట‌.

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుపేరు చెప్పి అచ్చిరెడ్డి, ఆయన కొడుకు వంశీ కృష్ణారెడ్డి విజ‌య‌వాడ వ‌న్‌టౌన్‌లో అరాచకాలకు పాల్పడుతున్నా మంత్రి చూసీ చూడ‌న‌ట్లు ఎందుకు వుంటున్నార‌ని స్థానిక ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఖ‌మ్మం పోలీసుల జోక్యంతో జాతకాలోడి బండారం బట్టబయలైంది. అందరి జాతకాలు చెపుతాననే ఇతగాడు తెలంగాణ పోలీసుల దెబ్బకు కుటుంబంతో సహా పరార్.