English | Telugu

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం కేసీఆర్...

తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో బస చేసిన కేసీఆర్ కాసేపట్లో హెలిక్యాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు. నీటి నిల్వకు సంబంధించి అధికారులతో సమీక్ష చేస్తారు. తుపాకులగూడెం ఆనకట్టను కేసీఆర్ పరిశీలించనున్నారు, తుపాకులగూడెం రిజర్వాయరకు సమ్మక్క బ్యారేజీగా పేరు పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరిన కేసీఆర్ కరీంనగర్ చేరుకున్నారు, రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో బస చేశారు, ఉదయం హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం వెళ్లి ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మి ఆనకట్టను పరిశీలించనున్నారు. ఆనకట్టలో నదీ జలాల నిల్వ తీరు, ఆనకట్టకు సంబంధించిన విషయాలు ఇతరత్రా అంశాలపై అక్కడే ఇంజినీరులు అధికారులతో సమీక్షించనున్నారు. గోదావరి నదితో పాటు పరిసర ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా సీఎం పరిశీలిస్తారు. లక్ష్మి ఆనకట్టతో పాటు సరస్వతి, పార్వతి ఆనకట్టల నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్న నీటి నిల్వకు సంబంధించి అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నారు.

అంతకుముందు కాళేశ్వరం టూర్ పై ప్రగతి భవన్ లో సంబంధిత అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటుందన్న కేసీఆర్.. బ్యారేజ్ లు నిండు కుండల్లా మారాయి అన్నారు. రానున్న వానాకాలం నుంచి వరదనీటి ప్రవాహం పెరుగుతుంది అన్నారు, ప్రాణహిత ద్వారా లక్ష్మీ బ్యారేజికి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తిపోసి అటు నుంచి కాలువలకు మళ్లించే దిశగా ఇరిగేషన్ శాఖ ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.