English | Telugu
ఆ విషయంలో జగన్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన ప్రధాని మోడీ...
Updated : Feb 13, 2020
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చర్యలతో పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ప్రధాని మోదీ సీఎం వైఎస్ జగన్ వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రంపై వారిలో అపనమ్మకం ఏర్పడిందని ఇటీవలి దావోస్ సదస్సులోనూ పలువురు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ ప్రధానితో దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష కేంద్రం ఉత్తర్వులిచ్చినా, హైకోర్టు ఆదేశించినా విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకపోవటం, కియా మోటర్స్ యాజమాన్యానికి బెదిరింపులు దీంతో ఆ సంస్థ తమిళనాడుకు తరలిపోనుందని వస్తున్న వార్తలు మొదలైన అంశాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ లు వెనుకాడుతున్నారని దీని ప్రభావం దేశ వ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణంపై ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో విదేశీ పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాష్ట్రాలు తిరోగమన విధానాలు అవలంబించడం సరైంది కాదని చెప్పారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికినట్లు సమాచారం.
ప్రధానంగా రాష్ట్రం నుంచి కియా మోటార్స్ ప్రాజెక్టు తరలిపోనుందని వచ్చిన వార్తలపై ఆరా తీసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు, చిన్న చిన్న కాంట్రాక్టు విషయంలో కియా యాజమాన్యాన్ని వైసీపీ నేతలు ముఖ్యంగా హిందూపురం వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్ బెదిరించినట్లు విమర్శలు రేగుతున్న నేపథ్యంలో మాధవ్ ను సీఎం తన వెంట ప్రధాని నివాసానికి తీసుకెళ్లడం గమనార్హం. జగన్ వినతి పత్రం సమర్పించి ఒక్కో అంశాన్ని వివరిస్తున్నప్పుడు ప్రధాని దాదాపు మౌనం పాటించినట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం పార్లమెంట్ లో చెప్పిన తర్వాత కూడా దానిని సీఎం తన వద్ద ప్రస్తావించటంతో మోదీ సీరియస్ గా విన్నట్లు తెలిసింది. పరిపాలన వికేంద్రీకరణ కోసం తాము మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని జగన్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి మరో వెయ్యి కోట్ల రూపాయలు ఉందని ప్రధానిని కోరటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కర్నూలును జుడీషియల్ రాజధానిగా మార్చాలని నిర్ణయించామని చెప్పిన జగన్ హైకోర్డు ప్రధాన బెంచ్ ను కర్నూలుకు తరలించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించాలని ప్రధాని సూచించినట్లు తెలిసింది. షాను కలిసేందుకు జగన్ ఒకట్రెండు రోజుల్లో మళ్లీ ఢిల్లీ రానున్నట్లు సమాచారం. కాగా వినతిపత్రంలోని విషయాలను వివరించాక జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసులను ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. సాయంత్రం మూడు గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ను వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, వంగా గీత, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, తలారి రంగయ్య, బల్లి దుర్గా ప్రసాద్, రెడ్డెప్ప, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏ వ్యాఖ్యలైనా చెయ్యాలి అని మాధవ్ కు సీఎం అందరి సమక్షంలో సూచించినట్టు తెలిసింది. సీఎం వెంట ప్రధాని నివాసానికి మాధవ్ తప్ప ఎంపీలెవరూ వెళ్లలేదు. ఎలాగూ తనను ప్రధాని వద్దకు జగన్ తీసుకెళ్లరు అలాంటప్పుడు వెళ్లి పడిగాపులు కాయడం ఎందుకని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.