English | Telugu

అత్యవసరం లేని సర్జరీలు వాయిదా వేయండి

అత్యవసర సేవలు మినహా, తెలంగాణ అన్ని సేవలు బంద్! కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు అలాగే మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు సి.ఎం. తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని ఆయ‌న సూచించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. గర్భిణులను కంటికి రెప్పలా చూసుకుంటామని కేసీఆర్ చెప్పారు. వారి కోసం అమ్మ ఒడి వాహనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అత్యవసరం లేని సర్జరీలు వాయిదా వేయాలని ప్రైవేట్ ఆస్పత్రులకు సూచించారు.

ఒకే రోజు ఆదివారంనాడు 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం తెలిపారు. వీరిలో ఇద్దరు లండన్, ఇద్దరు దుబాయ్, మరొకరు స్కాట్లాండ్ నుంచి వచ్చారని సి.ఎం. తెలిపారు. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 26కు పెరిగినట్లు తెలిపారు. అయితే.. బాధితులెవరికీ ప్రమాదమేమీ లేదని వివరించారు.