English | Telugu

తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు...

తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం సమ్మెకు సై అంటున్న ఆర్టీసీ కార్మికులను ఊరటించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాలని తీర్మానించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన క్యాబినెట్ సబ్ కమిటీలను నియమించాలని నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున సమ్మె యోచన విరమించుకోవాలని సూచించింది మంత్రివర్గం, కార్మికులు డిమాండ్ లు చెప్పారని ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో చర్చించాలని సూచించింది.

ప్రభుత్వ సంస్థను కాపాడే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా క్యాబినెట్ స్పష్టం చేసింది. శాఖల వారీగా చూస్తే వైద్య ఆరోగ్యంపై ఒక కమిటీని నియమించిన తెలంగాణా ప్రభుత్వం ఇందులో ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల అధ్యక్షుడిగా ఉన్నారు. కేటీఆర్, ఎర్రబల్లి, తలసాని సభ్యులుగా కొనసాగుతారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సీజనల్ జబ్బులు, అంటువ్యాధులు తదితర విషయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, సేవలపై కమిటీ పర్యవేక్షిస్తుంది. గ్రామీణ పారిశుద్ధ్యం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షుడిగా ఉంటారు, ఇందులో సభ్యులుగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ ఉంటారు. ప్రస్తుతం అమలవుతున్న ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళిక పరిస్థితి గ్రామాల్లో ఇతర పారిశుధ్య పరిస్థితులను కమిటీ చూసుకుంటుంది.

అవసరమైతే సరికొత్త కార్యాచరణ కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవచ్చు. పట్టణ పారిశుద్ధ్యానికి మరో కమిటీ ఏర్పాటైంది, దీనికి అధ్యక్షులు హరీశ్ రావుతో పాటు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి ఇందులో సభ్యులుగా ఉంటారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం, ఈ కమిటీ లక్ష్యంగా ఉండబోతోంది. వనరుల సమీకరణకు మరో కమిటీ ఉంది, దీనికి అధ్యక్షుడిగా కూడా మంత్రి హరీశ్ రావే ఉంటారు, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సభ్యులుగా కొనసాగుతారు. పచ్చదనం కమిటీకి అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండి, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని, ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. సాగును పెంచేలా వ్యవసాయంపై మరో కమిటీ ఏర్పాటు అవగా, దానికి అధ్యక్షుడిగా మంత్రి నిరంజన్ రెడ్డి సభ్యులుగా గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి ఎర్రబెల్లి ఉంటారు.

సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం, కల్తీలు నిరోధించటం, సాగుపై సమగ్ర విధానాన్ని అమలు చేయడమే ఈ కమిటీ లక్ష్యం. ఇక పౌల్ట్రీ కోసం కూడా కమిటీని ఏర్పాటు చేసింది క్యాబినెట్. దీనికి చీఫ్ గా తలసాని శ్రీనివాస్ వుంటే సభ్యులుగా శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి ఉన్నారు. సంక్షేమ కమిటీకి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షుడు, సభ్యులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ ఉంటారు. ఈ నెల పదిన మంత్రులు, కలెక్టర్ లతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లో అమలవుతున్న ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై సీఎం వీరితో సమావేశమవుతారు, ఈ భేటీకి మంత్రులు, అధికారులు, డీపీవోలు, డీ.ఎల్.పీ.వోలు హాజరవుతారు.