English | Telugu

జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిన కేసీఆర్

హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు చాలా మంది మెట్రో ప్రయాణం పై ఆసక్తి చూపిస్తున్నారు. మియాపూర్ టూ ఎల్బీనగర్, నాగోల్ టూ రాయదుర్గం ఇలా మెట్రో ప్రయాణంతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య తొమ్మిది స్టేషన్ లను నిర్మించారు మెట్రో సభ్యులు. ఈ మార్గం అందుబాటులోకి రావటం వల్ల జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లటానికి కేవలం 16 నిమిషాల సమయమే పట్టనుంది. ఈ మెట్రో క్యారిడార్ హైదరాబాదీలకే కాదు, జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చే వారికి కూడా ఉపయోగపడుతుంది. గత నవంబర్ లోనే ట్రయల్ రన్స్ మొదలవ్వాల్సి ఉండగా ట్రయల్ రన్స్ లో భాగంగా 17 రకాల పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షలన్నీ సంతృప్తికరంగా పూర్తయ్యేందుకు దాదాపు 45 రోజుల సమయం పట్టింది. జనవరిలోనే క్యాడర్ టూ ను ఆరంభించాలని భావించారు.కానీ మున్సిపల్ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇక శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది.

జేబీఎస్ టూ ఎంజీబీఎస్ రూట్ తో కలిపి మొత్తం 67 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటు లోకి వచ్చినట్లు సమాచారం.ఇప్పటి వరకు దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్ గా హైదరాబాద్ మెట్రో నిలిచినట్లు సమాచారం. మరో 11 కిలోమీటర్ల రూటు అదనంగా కలవబోతోంది. దీంతో మరింత పొడవైన మెట్రో మార్గంగా రికార్డులోకి ఎక్కనుంది హైదరాబాద్ మెట్రో. మెట్రోతో సిటీ బస్సులు ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైల్వే స్టేషన్ లతోనూ పూర్తిస్థాయిలో అనుసంధానం ఏర్పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగిన వారంతా స్కైవాక్ ద్వారా మెట్రో స్టేషన్ కు వెళ్లిపోవచ్చు. మియాపూర్, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, నాగోల్ నుంచి మెట్రోలో ఎంజీబిఎస్ కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సులభంగా చేరుకోవచ్చు.మొత్తం మీద హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నట్లు తెలుస్తొంది.