English | Telugu

తొలి 'దిశా పోలీస్ స్టేషన్' ప్రారంభానికి సర్వం సిద్ధం

తెలంగాణాలో సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటన తర్వాత మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దిశా చట్టం తీసుకువచ్చారు. దిశా చట్టం ప్రకారం మహిళలు చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్ష విధించనున్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి స్టేషన్ లు ఏర్పాటు కానున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలిదశ పోలీస్టేషన్ కు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి ఎనిమిదిన సీఎం జగన్ దిశా పోలీసు స్టేషన్ ఒక స్టాఫ్ సెంటర్ ను స్వయంగా ప్రారంభించబోతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 దిశా పోలీసు స్టేషన్ లు ఏర్పాటు చేయనున్నారు. రాజమండ్రిలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండంతస్తుల్లో దిశా పోలీసు స్టేషన్ ఉండనుంది. వెయిటింగ్ హాల్, హెల్ప్ డెస్క్, కౌన్సెలింగ్ కు ఇతరత్రా సౌకర్యాలతో అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. డీఎస్పీ స్థాయి ఇద్దరు అధికారులు, ఐదుగురు ఇన్ స్పెక్టర్ లు, 18 మంది కానిస్టేబుల్స్, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్ లు, ఒక సైబర్ నిపుణుడు ఈ స్టేషన్ కు సేవలందిస్తారు. ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు 52 మంది సిబ్బందితో స్టేషన్ ను నిర్వహించనున్నారు. దిశా కంట్రోల్ రూం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.

కేసు త్వరితగతిన విచారణ పూర్తి చేయటం, దోషులు అనతికాలంలోనే శిక్షించటానికి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. ఇన్వెస్టిగేషన్ అధికారికి ఓ కేసు ఛేదించేందుకు వారం రోజులు గడువిస్తారు, ఆయనకు ఫోరెన్సిక్, ఇతరత్రా సిబ్బంది కేసు దర్యాప్తు విచారణలో సాయంగా ఉంటారని ఎపి డిజిపి గౌతం సవాంగ్ వెల్లడించారు. మహిళల రక్షణకు దిశా పోలీస్ స్టేషన్ లు ఉపయోగపడతాయన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. రాజమండ్రిలో తొలి దిశా పోలీస్టేషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా మరో 18 దిశ పోలీసు స్టేషన్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ తో పాటు దిశా చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను కూడా ముఖ్య మంత్రి ప్రారంభిస్తారు, దిశా చట్టం ప్రకారం నమోదైన కేసుల విచారణ 14 రోజుల్లో పూర్తికావాలి, జిల్లాకొకటి చొప్పున రాష్ట్రంలో మొత్తం 13 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి పదమూడు మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను అందుబాటులో ఉంచుతారు. బాధితురాలికి చట్టబద్ధంగా సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం ఈ దిశా స్టేషన్ లను ఏర్పాటు చేస్తుంది.