English | Telugu

ఠాగూర్ నుంచి పార్క్ హయత్ వరకు... చిరంజీవి-రాజశేఖర్ రగడలో ఎన్నో మలుపులు...

మెగాస్టార్ చిరంజీవి... యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ మధ్య విభేదాలు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. ఠాగూర్ సినిమా నాటినుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమిళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్ అయిన రమణ సినిమా హక్కులను మొదట రాజశేఖర్ సొంతం చేసుకున్నాడు. కానీ చిరంజీవి చివరి నిమిషంలో రంగంలోకి దిగి... ఆ హక్కులను చేజిక్కించుకున్నాడు. ఆ సినిమాను ఠాగూర్‌గా తెలుగులో నిర్మించారు... అది సెన్సేషనల్ హిట్ అయింది. తనకు రావాల్సిన క్రెడిట్ అంతా చిరంజీవి కొట్టాడనే కోపం పెంచుకున్నారు రాజశేఖర్. ఆ తర్వాత చిరంజీవి, రాజశేఖర్ మధ్య సత్సంబంధాలు ఏర్పడలేదు. దూరం మరింత పెరిగింది. ఇక, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ వాహనంపై రాళ్ల దాడి జరిగింది. దాంతో, చిరంజీవే స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇలా ఇద్దరి మధ్య సఖ్యత కుదరడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి.

దాసరి నారాయణరావు సంతాప సభలో చిరంజీవి మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత రాజశేఖర్ దంపతులు వచ్చారు. ఒకరికొకరు తారసపడకుండా ఉండేందుకే ...ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు వచ్చారని టాక్ వినిపించింది. ఇది వీరిద్దరి మధ్య సఖ్యత లేదన్న సంకేతాలను ఇచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య విబేధాలు తగ్గుతాయని అంతా భావించారు. అయితే, ఇటీవల ఇరువురి మధ్యా కొంచెం దూరం తగ్గినట్లు అనిపించినా, తాజాగా మా డైరీ ఆవిష్కరణలో చిరంజీవి-రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం కలకలం రేపింది.

ఠాగూర్ సినిమా నుంచి ప్రజారాజ్యం వరకూ వీరిమధ్య చిటపటలు కొత్తేంకాదు. అయితే ఆంధ్రప్రదేశ్‌‌ రాజకీయ పరిణామాలు, ఇండస్ట్రీలో మారుతున్న కొన్ని లెక్కలు సైతం, వీరిమధ్య తాజా రగడకు ఆజ్యం పోశాయన్న చర్చ జరుగుతోంది.