English | Telugu

అమ్మఒడి కోసం ఆపసోపాలు... అప్పుల వేటలో జగన్ సర్కారు...

పథకం మీద పథకం ప్రకటిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి... అసలా పథకాలకు డబ్బు ఎక్కడ్నుంచి తెస్తున్నారనే చర్చ మంత్రుల్లో సైతం జరుగుతోంది. అయితే, ఆరు నెలల పాలనలో 30వేల కోట్లకు పైగా అప్పులు చేశారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇక, ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకం అమలు కోసం మరోసారి జగన్ ప్రభుత్వం అప్పుల వేటలో పడింది. వడ్డీ రేట్లు ఎక్కువైనాసరే అప్పు తీసుకొస్తున్నారు. తాజాగా, ఆంధ్రాబ్యాంకు నుంచి 8.5శాతం వడ్డీకి 15వందల కోట్ల రుణం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను ఆస్తులుగా చూపించి పదివేలకోట్ల రుణం సమీకరించాలని చూస్తున్నారు. అలాగే, మరో బ్యాంకు నుంచి 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. అమ్మఒడి, రెండో విడత రైతు భరోసా గడువు ముంచుకొస్తుండటంతో వీలైనంత త్వరగా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని అప్పు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్క అమ్మఒడికే 6వేల 500కోట్లు అవసరం కాగా, రెండో విడత రైతు భరోసాకి 2వేల 500కోట్లు కావాలి. మొత్తంగా సుమారు 10వేల కోట్లు అవసరముందని ఆర్ధికశాఖ లెక్కగట్టింది.

అయితే, ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్లే అవకాశమున్నా ప్రభుత్వం అటువైపు చూడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఎందుకంటే, ఓడీకి వెళ్తే 7.15శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. కానీ, 8.5శాతం అధిక వడ్డీతో బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకునేందుకే జగన్ ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా డిసెంబర్ వరకు 29వేల కోట్ల రుణాలను ప్రభుత్వం సమీకరించింది. ఈ రుణాలపై వడ్డీ 8శాతంలోపే ఉంది. అయితే, సెక్యూరిటీల వేలం ద్వారా ఇంకా 3వేల కోట్లకుపైగా అప్పు తెచ్చుకునే అవకాశమున్నా... కేంద్రం అనుమతి ఇవ్వలేదనే మాట వినిపిస్తోంది. అప్పుల పరిమితిని ఏపీ దాటేయడమే దీనికి కారణమంటున్నారు. మొత్తానికి అమ్మఒడి, రెండో విడత రైతు భరోసా చెల్లింపుల కోసం జగన్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందని అంటున్నారు.