English | Telugu

బీసీజీ రిపోర్ట్ కి తల తోక ఉందా?.. అన్నీ అబద్ధాలు!!

బోస్టన్ కమిటీ నివేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. బీసీజీ ఎప్పుడు వేశారు..తల తోక ఉందా?. క్లయింట్‌కు ఏది కావాలంటే అది రాసి ఇచ్చింది అని విమర్శించారు. బీసీజీ గ్రూప్‌తో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. రోహిత్‌రెడ్డి చెప్పింది బీసీజీ రాసిచ్చిందని ఆరోపించారు. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం సరికాదని హితవు పలికారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చంద్రబాబు అన్నారు.

రాజధానికి లక్షా 10 వేల కోట్లు అవసరమని ఎవరు చెప్పారు?.. అమరావతిని చంపేసి పేద అరుపులు అరుస్తారా? అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త నగరాలు సైబరాబాద్‌, నవీముంబై, డెహ్రాడూన్‌ అభివృద్ధి చెందలేదా? అని ప్రశ్నించారు. అమరావతిని తీసుకెళ్లి ఫెయిల్యూర్‌ సిటీలతో పోలుస్తారా? అని మండిపడ్డారు. 2009 వరదల్లో అమరావతి మునిగిపోయిందని అబద్ధాలు చెబుతున్నారు. అబద్దాలు చెప్పడానికి సిగ్గుండాలి. విశాఖలో హుద్‌హుద్ వస్తే 9 రోజులు అక్కడే ఉన్నాను. 2009లో వరదలు వస్తే కర్నూలు మునిగిపోయిందని చంద్రబాబు గుర్తుచేశారు.

రాజధానికి మిమ్మల్ని ఎవరు అప్పులు తెమ్మన్నారు?.. అమరావతిలో ఇప్పుడున్న వసతులతో పాలించలేరా?. అమరావతిలో హైకోర్టు, పరిపాలన భవనాలు లేవా? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్ర రాజధానిలోనైనా ఎగ్జిక్యూటివ్‌, లెజిస్లేచర్‌ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయా? అని నిలదీశారు. అమరావతిలో కట్టడాలకు ఎక్కువ ఖర్చవుతుందని అబద్దాలు చెబుతున్నారు. హైదరాబాద్‌, చెన్నై కంటే అమరావతిలోనే తక్కువ ఖర్చవుతుందని తెలిపారు. అమరావతిలో కట్టిన బిల్డింగ్‌లు, రోడ్లు మీకు కనిపించలేదా?. రైతులతో ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌ను గౌరవించరా? అని చంద్రబాబు ప్రశ్నించారు.