English | Telugu

మునిసిపల్ ఎన్నికలు అవ్వగానే ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం!!

వారుసుడి పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గం సుగమం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టటానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత లేదా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత ముహూర్తం నిర్ణయించాలనే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. రాహుల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ చేసిన పొరపాటును తాను చెయ్యరాదని కేసీఆర్ భావిస్తున్నారని అందుకే వారసుడి పట్టాభిషేకం దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. తానే సీఎంగా కొనసాగుతానని సాక్షాత్తూ అసెంబ్లీ లోనే కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. అయినా ఇటు కేసీఆర్ కు సన్నిహితులైన మంత్రులు, అటు కేటీఆర్ కు అత్యంత సన్నిహితులైన మంత్రులు మాత్రం కాబోయే సీఎం కేటీఆర్ అంటూ వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఇతర నేతల బహిరంగ ప్రకటనలకు.. పార్టీలో , ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో కేటీఆర్ కు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తే తెలుస్తుందని అంటున్నారు. అధిష్టానం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా వెలువడుతున్న సంకేతాలు కూడా అందుకు కారణమని పలువురు టీఆర్ఎస్ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టాక పార్టీ వ్యవహారాలన్ని ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ పీపీ సమావేశం కూడా కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగింది. ఇక రెండో సారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అధికార అనధికార ప్రముఖులను కలవటం కేసీఆర్ బాగా తగ్గించారు. కేవలం కీలక సందర్భాల్లో మాత్రమే నేరుగా మార్గ నిర్దేశం చేస్తున్నారు. అధికార అనధికారిక ప్రముఖులంతా కేటీఆర్ ను కలవటం తమ సమస్యలను విన్నవించుకోవడం రివాజుగా మారింది. కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోవడంతో అప్పటి వరకు ఆయన అధికారిక సమీక్షలు నిర్వహించలేక పోతున్నారనే ముచ్చట తగ్గింది. సీఎం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ యే అయినా ఆయన తరపున అటు ప్రభుత్వం ఇటు పార్టీలో కేటీఆర్ అన్నీ తానే అయి నిర్వహించటాన్ని ప్రభుత్వ పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నాయి. ఈ వాతావరణం తొందర్లోనే కేటిఆర్ సీఎం కాబోతున్నారనే ప్రచారానికి ఊతమిస్తోందని అంటున్నారు. అధికారం ఇంకా నాలుగేళ్లు మిగిలివున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం లాంఛనమేనని ఆ తరువాత కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.