English | Telugu

నోట్ల కట్టల వ్యవహారం తేల్చేందుకు.. దుబ్బాక ఉప ఎన్నికకు సీఈసీ ప్రత్యేక పరిశీలకుడు 

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా మొన్న ఆదివారం సిద్దిపేటలో రాష్ట్ర పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య నోట్ల కట్టల స్వాధీనంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెల్సిందే. ఇదే విషయమై బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం తో అక్కడి పరిస్థితులు మరింత వేడెక్కాయి. దీనిపై స్థానిక పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న‌ర‌ని బీజేపీ ఆరోపించింది. సిద్ధిపేట ఘ‌ట‌న త‌ర్వాత కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేక ప‌రిశీల‌కుడిని పంపాల‌ని, కేంద్ర బ‌లగాల ర‌క్ష‌ణ‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని బీజేపీ కోరింది. మరోవైపు దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. తాజాగా నోట్ల కట్టల కలకలంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడిగా నియమించింది. ఈ మొత్తం వ్యవహారం పై స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు. ఐపీఎస్ అధికారి స‌రోజ్ కుమార్ కు పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు జ‌రిపినందుకు గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం అవార్డు కూడా ల‌భించింది.