English | Telugu
యూపీలో ఆగని అత్యాచారాలు.. సీఎం యోగిని మఠానికి పంపేయాలంటున్నమాయావతి
Updated : Oct 1, 2020
ఇది ఇలా ఉండగా రాష్ట్రం లోని బులంద్ షెహర్ లో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పొరుగున ఉండే 20 ఏళ్ల యువకుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసినట్లు అతను ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆజంగఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల వయస్సు గల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. జియాన్ పూర్ లో బాలిక ఇంటి పక్కనే ఉండే యువకుడు బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇది ఇలా ఉండగా హత్రాస్ దారుణ ఘటనతో పాటు యూపీలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో యోగి విఫలం అయ్యారని, యోగిని తిరిగి గోరఖ్ పూర్ మఠానికి పంపించాలని మాయావతి ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆయనకు అదీ నచ్చకపోతే.. రామ మందిర నిర్మాణ పనులను అప్పజెప్పాలని పేర్కొన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా యూపీలో ఒక్క రోజు కూడా గడవడంలేదని ఆమె మండిపడ్డారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో యోగి విఫలమైతే వెంటనే రాజీనామా చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. కనీసం హత్రాస్ ఘటన తర్వాత అయినా, రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గుతాయని తాము బావించామని, కానీ బలరాంపూర్‌లో మరో ఘటన.. బులంద్ షెహర్ లో ఇంకో ఘటన.. ఇలా జరుగుతూనే ఉన్నాయని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో నేరస్థులకు ఫ్రీహ్యాండ్ దొరికిందని మాయవతి ఈ సందర్భంగా మండిపడ్డారు.