English | Telugu
సినిమా కథ ఎందుకూ పనికి రాదు... ఇతని ప్రేమ ముందు...
Updated : Feb 12, 2020
తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ప్రేమికులు ఎన్ని కష్టాలైనా పడతారు. ఎంతటి సాహసానికైనా తెగిస్తారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు... ఇలా అన్నింటినీ దాటతారు. కుటుంబాన్ని ఎదిరిస్తారు. ఎవరు ఒప్పుకున్నా... ఒప్పుకోకపోయినా... చివరికి తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంటారు. వికారాబాద్ యువకుడు అలాంటి సాహసమే చేశాడు. తన ప్రేమ కోసం అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు.
ఆ యువకుడి పేరు బొబ్బిలి భాస్కర్... ఉండేది వికారాబాద్... డిగ్రీ వరకు చదువుకున్నాడు... అయితే, భాస్కర్... ఓ ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు... ఆ యువతి... భాస్కర్ కు చిన్ననాటి నుంచి తెలిసిన అమ్మాయే... స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ వరకు... ఒకే స్కూల్... ఒకే కాలేజీలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు... అమ్మాయి కూడా భాస్కర్ ను ప్రేమించింది... మొదట స్నేహంగా మొదలైన వీరిద్దరి అనుబంధం... ఆ తర్వాత పీకల్లోతు ప్రేమకు దారితీసింది... ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు ఇద్దరూ... భాస్కర్ ఇంటికి యువతి వచ్చిపోతూ ఉండేది... నువ్వు ముస్లిం అమ్మాయివి... మా ఇంటికి రావొద్దు... మా అబ్బాయిని ప్రేమించొద్దు... అంటూ భాస్కర్ కుటుంబ సభ్యులు చెప్పినా... నేను పెళ్లంటూ చేసుకుంటే... భాస్కరే చేసుకుంటానంటూ తన మనసులో మాటను చెప్పేది... అయితే, ఇద్దరూ డిగ్రీ చదువుతుండటంతో... గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకుని కలిసి బతకాలని అనుకున్నారు... అలా, రెండు మూడేళ్లు గడిచిపోయాయి... అయితే, వీళ్లిద్దరి ప్రేమకు మతం అడ్డొచ్చింది... భాస్కర్ హిందువు... అమ్మాయిది ముస్లిం... దాంతో, యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు... కానీ, తన ప్రేమను బతికించుకోవాలనుకున్న భాస్కర్... యువతి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు.... చివరికి, నువ్వు ఇస్లాం మతంలోకి మారితే, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామంటూ యువతి తల్లిదండ్రులు చెప్పడంతో... ఎలాగైనా తన ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు. తన ప్రేమ కోసం ఏకంగా మతాన్నే మార్చుకున్నాడు.
తన ప్రేయసి చెప్పినట్లుగా తన పేరును మహ్మద్ అబ్దుల్ హునైన్ గా మార్చుకున్నాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించడమే కాకుండా తన పేరును మహ్మద్ అబ్దుల్ హునైన్‌గా మార్చుకున్న భాస్కర్‌ను చూసి అతని తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోయారు. భాస్కర్ కట్టూబొట్టు అంతా ముస్లింలా మారిపోయాడు. ఎంతలా అంటే, భాస్కర్ ను చూస్తే... ఇతను ఇంతకుముందు హిందువు అంటే నమ్మలేనంతగా మారిపోయాడు... అచ్చం ముస్లింలా మాదిరిగా గడ్డం పెంచుకున్నాడు... చాలా మంది ముస్లింలకు సైతంరాని ఇస్లాం ప్రవచనాలను, మహ్మద్ ప్రవక్త సారాన్ని నేర్చుకున్నాడు... మత మార్పిడి కోసం ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ముస్లింగా మారినట్లు మత ధృవీకరణ పత్రాన్ని పొందాడు. పెళ్లికి అంతా సిద్ధం చేసుకుని యువతి ఇంటికి వచ్చాడు. అయితే, కథ ఇక్కడే కొత్త మలుపు తిరిగింది.
పూర్తిగా ముస్లింగా మారిపోయి, ఎన్నో ఆశలతో యువతి ఇంటికెళ్లిన మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ భాస్కర్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఇస్లాం మతం స్వీకరిస్తే కూతురినిచ్చి పెళ్లి చేస్తామన్న యువతి కుటుంబ సభ్యులు... అతనెవరో తెలియనట్లు వ్యవహరించారు. పదేపదే ఇంటికి వస్తున్నాడంటూ మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ భాస్కర్‌పై దాడికి పాల్పడ్డారు. ప్రేయసి నిక్కత్ సుల్తాన్‌ను కలవకుండా ఆంక్షలు విధించారు. యువతిని నిర్బంధించారు. దాంతో, ఏం చేయాలో దిక్కుతోచక మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అయితే, భాస్కర్ అలియాస్ మహ్మద్ అబ్దుల్ హునైన్ ప్రేమ కథ... ఇక్కడ మరో మలుపు తిరిగింది.
భాస్కర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హెచ్‌ఆర్సీ... యువతిని తమ ముందు హాజరుపర్చాలంటూ వికారాబాద్ పోలీసులను ఆదేశించింది. హెచ్‌ఆర్సీ ఆదేశాలతో నిక్కత్ సుల్తాన్‌ను మానవ హక్కుల కమిషన్ ముందు హాజరుపర్చారు పోలీసులు. దాంతో, భాస్కర్ అలియాస్ మహ్మద్ అబ్దుల్ హునైన్ నీకు తెలుసా? మీరిద్దరూ ప్రేమించుకున్నారా? అంటూ యువతిని హెచ్‌ఆర్సీ ఛైర్మన్ ప్రశ్నించారు. అయితే, భాస్కర్‌తో తనకెలాంటి సంబంధం లేదని, మతం మార్చుకోమని తాను చెప్పలేదని నిక్కత్ సుల్తాన్ తెలిపింది. అంతేకాదు, భాస్కర్‌తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆరోపించింది. తాను భాస్కర్‌ను ప్రేమించలేదని, మతం మారితే పెళ్లి చేసుకుంటానని చెప్పలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు, తన కుటుంబ సభ్యుల నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. దాంతో, భాస్కర్ పిటిషన్‌ను హెచ్ఆర్సీ కొట్టివేసింది.
నిక్కత్ సుల్తాన్ మాటలతో మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ భాస్కర్ కంగుతిన్నాడు. తాను ప్రేమించిన యువతి అలా మాట్లాడటాన్ని తట్టుకోలేకపోయాడు... నీకోసమే కదా... ఎన్నో కష్టాలు పడ్డాను... ఎన్ని కష్టాలెదురైనా నీతోనే జీవితం అనుకున్నాను... అంటూ కోర్టు హాల్లో కన్నీరు మున్నీరయ్యాడు... అయితే, తన ప్రేమను గెలిపించుకునేందుకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని, కచ్చితంగా తన ప్రేమను దక్కించుకుంటానని భాస్కర్ అలియాస్ మహ్మద్ అబ్దుల్ హునైన్ అంటున్నాడు. అయితే, తన ప్రేయసి కోసం ముస్లింగా మారిన భాస్కర్ ను చూసి కోర్టుకొచ్చినోళ్లే కాదు... మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. అతని ప్రేమ కథను విని అయ్యో అంటూ చలించిపోయారు.