English | Telugu

ఆర్టీసీ సమ్మెలో బీజేపీ వ్యూహం సఫలమవుతుందా?

ఆర్టీసీ సమ్మెపై రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. ఒకపక్క ఈ టెన్షన్ కొనసాగుతుంటే బీజేపీ కొత్త వ్యూహలతో కేసీఆర్ కు మరొక ఆందోళన కూడా పెరిగిపోతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులకు మద్దతుగా బీజేపీ లీడ్ తీసుకుంటోంది. తామున్నామని భరోసా ఇస్తోంది. ప్రభుత్వాని కి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాడుతామని ప్రకటించింది. గవర్నర్ ను కూడా కలిసి ఫిర్యాదు చేయడంతో రాజకీయం మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి.

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతుగా బీజేపీ పూర్తి స్థాయిలో పోరాటం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఉద్యోగుల్లో అంతంత మాత్రం గానే ఉన్న మద్దతును ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండి పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్య మంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలను గవర్నర్ వద్దకు తీసుకెళ్లి తమ వాదన వినిపించే అవకాశం కల్పించారు.బిజెపి నేతలు కూడా గవర్నర్ కు ప్రత్యేకంగా వినతి పత్రం ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయాన్ని ప్రభుత్వం తీరును వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ మద్దతు ఆర్టీసీ కార్మికులకు ధైర్యాన్నిస్తోంది. కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ అగ్గితో తలగోక్కున్నాడని త్వరలోనే ఒళ్ళు కాల్చుకుందని హెచ్చరిస్తున్నారు. టీచర్లు, రెవిన్యూ ఉద్యోగులు, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగు లు అందర్నీ కేసీఆర్ అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు.యాభైవేలమంది ఆర్టీసీ ఉద్యోగుల్లో తొలగిస్తామంటే బిజెపి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు బీజేపీ నేత.

తెలంగాణలో రాజకీయంగా బలపడాలని లక్ష్యంతో బీజేపీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు చేరువైతే బలం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంచనాతో ఉన్నరు.ఇప్పుడు వివిధ వర్గాల్లో పట్టుపెంచుకోవడం కీలకమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికి ఆర్టీసీ సమ్మె వారికి బాగా ఉపయోగపడుతోంది. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేయటం ద్వారా తామే ప్రత్యామ్నాయమని నిరూపించాలనుకుంటున్నారు. అందుకే లక్ష్మణ్ కేసీఆర్ పై చేసే విమర్శల విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవడం లేదు. బీజేపీ దూకుడు విషయంలో టిఆర్ఎస్ కూడా కొద్ది రోజులుగా ఆందోళన చెందుతోంది. తెలంగాణలో ఆ పార్టీకి పెద్దగా బలం బలగం లేదని టీఆర్ ఎస్ నేతలు నమ్ముతున్నారు.కానీ ఆ పార్టీ అగ్ర నాయకత్వం వ్యూహాల విషయంలో మాత్రం టీఆర్ఎస్ పెద్దలకు కాస్తంత టెన్షన్ గా ఉంది. అందుకే మొదట్లో బిజెపిని పెద్దగా పట్టించుకోవద్దని తమ పార్టీ నేతలకు సూచించినా ఆ తరవాత మాత్రం కౌంటర్ లు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు బీజేపీ నేతలు ఆర్టీసీ సమ్మె విషయాన్ని గవర్నర్ వద్దకు తీసుకువెళ్ళారు. కేంద్రం వద్దకు తీసుకు వెళ్లే అవకాశం ఉందటున్నారు. ఆర్టీసీలు కేంద్రానికి కొంత వాటా ఉంటుంది. కెసిఆర్ దూకుడు తగ్గించి ఆర్టీసీ కార్మికులకు మేలు చేస్తే రాజకీయంగా ఉపయోగమని బిజెపి నేతలు అంచనా వేసుకుంటున్నారు. అదే జరిగితే కేసీఆర్ పై పైచేయి సాధించినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ పై తమదైన శైలిలో ఘాటైన విమర్శలు చేయడంలో వెనక్కు తగ్గట్లేదు బీజేపీ నేతలు.