English | Telugu

సింథియాకు రాజ్యసభ సీటు, మంత్రి పదవి... మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కారు..! 

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కారులో తలెత్తిన సంక్షోభం పతాకస్థాయికి చేరింది. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి యువ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబావుటా ఎగరవేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన సుమారు 20మంది ఎమ్మెల్యేలు... బెంగళూరుకు తరలిపోవడంతో కమల్ నాథ్ సర్కారు కష్టాల్లో పడింది.

అయితే, జ్యోతిరాదిత్య సింధియాను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సోనియా ఆదేశాలతో రంగంలోకి దిగిన అహ్మద్ పటేల్... జ్యోతిరాదిత్యను రాజ్యసభకు పంపుతామంటూ హామీ ఇచ్చారు. అయితే, సింధియా వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ కు సింధియా తలుపు మూసేశారని చెబుతున్నారు. సింథియా స్నేహితుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ను రంగంలోకి దించినా జ్యోతిరాదిత్య స్పందించలేదని అంటున్నారు. జ్యోతిరాదిత్యను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కాంగ్రెస్ ఆశలు వదులుకుంది. దాంతో, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు పతనం అంచుల్లోకి చేరింది.

అయితే, కాంగ్రెస్ అధిష్టానం తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్యోతిరాదిత్య సింధియా... బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన జ్యోతిరాదిత్య సింధియా.... ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం సంచలనం రేపుతోంది. అంతేకాదు, సింధియా.... మోడీ, అమిత్ షాను కలవడంతో బీజేపీలో చేరడం ఖాయమని అంటున్నారు. అలాగే, సింథియాకు రాజ్యసభ సీటుతోపాటు, మోడీ కేబినెట్ లోకి కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.