ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షను దాటిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు విశాఖ నగరంలో కూడా కేసులు విపరీతంగా రికార్డ్ అవుతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇదే అంశం పై స్పందిస్తూ విశాఖలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వెంటనే విశాఖలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం నడుస్తున్న కరోనా టైం లో వైన్ షాపులు తెరిచి ఉంచే సమయం పెంచడం దారుణమని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అనుమానితులు కరోనా టెస్టులు చేయించుకుంటే రిపోర్టులు ఎన్ని రోజుల్లో వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని అయన వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అంబులెన్స్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కరోనా పేషెంట్లను హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ చేసేటప్పుడు మళ్లీ టెస్టులు చేయడం లేదని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని, అలాగే నర్సింగ్ స్టాప్ తక్కువగా ఉన్నందున తక్షణమే కొత్తవారిని నియమించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఇప్పటివరకు సుమారు 7,500లకు పైగా కేసులు నమోదయ్యాయని, అంతే కాకుండా రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోందని అయన ఆందోళన వ్యక్తం చేసారు. భవిష్యత్‌లో విశాఖ నగరంలోనే కేసులు 50వేల మార్క్ దాటే అవకాశముందని.. అదే కనుక జరిగితే నగర ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని విష్ణుకుమార్ రాజు అన్నారు.