English | Telugu
జగన్ అడ్డాలో సత్తాచాటిన బీజేపీ-జనసేన
Updated : Mar 15, 2020
ఆంధ్రప్రదేశ్‌లో వై.సి.పి. అధికార పార్టీ. సీఎం జగన్ సొంత జిల్లాలో బీజేపీ-జనసేన సత్తా చాటింది. ఏకంగా వైసీపీని తోసిరాజని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలా అస్సలు ఉనికే లేని బీజేపీ-జనసేన అభ్యర్థి సత్తా చాటడం వైసీపీ వర్గాలకు షాకింగ్ గా మారింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ టీడీపీ టికెట్లు దక్కని బలమైన అభ్యర్థులు బీజేపీ-జనసేన పార్టీలో చేరి అనూహ్య ఫలితాలను సాధించారు. పలు జిల్లాల్లో ఈ రెండు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఘనవిజయాలు సాధిస్తున్నారు. సీఎం సొంత జిల్లా కడపలోనూ ఇదే పునరావృతం కావడం గమనార్హం. కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వీరబల్లి మండలం మట్లిలో బీజేపీ-జనసేన ఎంపీటీసీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన రావూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయనకు వ్యతిరేకంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నుంచి ఒక్కరు కూడా పోటీగా నామినేషన్ వేయకపోవడం గమనార్హం. దీంతో బీజేపీ-జనసేన అభ్యర్థి రావూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాగా రాయచోటి ఎమ్మెల్యే గడొకోట శ్రీకాంత్ రెడ్డితో రావూరి శ్రీనివాస్ కు మంచి సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఆయన ఆదేశాల మేరకే వైసీపీ తరుఫున ఎవరూ నామినేషన్ వేయలేదని సమాచారం. అందుకే ఏకంగా అధికార వైసీపీ పార్టీని కాదని బీజేపీ-జనసేన ఇక్కడ విజయం సాధించిందని అంటున్నారు. స్నేహితుడి కోసం వైసీపీ పార్టీ అభ్యర్థినే పక్కనపెట్టిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే మంచి పేరు సమర్థ నాయకుడైన రావూరి కోసం వైసీపీ శ్రేణులంతా ఇలా పోటీచేయకుండా సహకరించారని చెబుతున్నారు.