English | Telugu

ఆ బీహార్ మంత్రికి పదవి మూన్నాళ్ళ ముచ్చటే అయింది.. 

పాపం మూడు రోజుల క్రితమే మంత్రిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన బీహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి తాజాగా తన పదవికి రాజీనామా చేయల్సి వచ్చింది. ఇటీవ‌ల కొత్తగా కొలువుదీరిన నితీష్ కుమార్ క్యాబినెట్ లో 14 మంది మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. దీంట్లో భాగంగా తారాపూర్‌ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్‌ చౌదరికి నితీష్ కుమార్ విద్యా శాఖను కేటాయించారు. అయితే ఆయన గతంలో భాగల్‌పూర్‌ వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పని చేసిన అనుభ‌వం ఉండ‌టంతో విద్యాశాఖ‌ను కేటాయించినట్లు ప్ర‌చారం జరిగింది.

అయితే మేవాలాల్‌ చౌదరి వ్యవసాయ వర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ గా ఉన్న సమయంలో యూనివర్సిటీ పరిధిలో నిర్మించిన కొన్ని భవనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా లంచం తీసుకుని కొందరు అర్హతలేని వారికీ యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, జూనియర్‌ శాస్త్రవేత్తలుగా నియమించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేవాలాల్ ను విద్యాశాఖా మంత్రిగా నియమించడం పట్ల ప్రతిపక్షాల తీవ్రస్థాయిలో విమర్శలు చేసాయి. సీఎం నితీశ్‌ కేవలం తన పదవిని కాపాడుకోవడం కోసం అవినీతిపరులకు కేబినెట్‌లో చోటు కల్పించారంటూ ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. అంతేకాకుండా క‌నీసం జాతీయగీతం కూడా పాడడం రాని వ్య‌క్తి బీహార్ విద్యాశాఖ మంత్రి అంటూ ప్ర‌తిప‌క్షాలు తాజాగా ఒక వీడియోను వైర‌ల్ చేయ‌టంతో సీఎం నితీష్ కుమార్ మంత్రితో రాజీనామా చేయించిన‌ట్లుగా వార్తలు వస్తున్నాయి.