English | Telugu
బీహార్ కు కొత్త ముఖ్యమంత్రి? పదవిపై ఆసక్తి లేదంటున్న నితీశ్
Updated : Dec 28, 2020
ఆదివారమే జేడీయూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. తన స్థానంలో రాజ్యసభ సభ్యుడు రామచంద్ర ప్రసాద్ సింగ్ ను జేడీయూ కొత్త చీఫ్ గా నియమించారు. పార్టీ అధ్యక్షుడిగా తప్పుకున్న కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి పదవి కూడా తనకు వద్దంటూ నితీష్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు బీహార్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం పోస్టును బీజేపీకి ఇచ్చేందుకు నితీష్ సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ 72 సీట్లలో విజయం సాధించగా, జేడీయూ 49 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. దీంతో బీజేపీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కాని పొత్తు ధర్మాన్ని పాటిస్తూ.. ఎన్నికలకు ముందే ప్రకటించినట్లుగానే తక్కువ సీట్లు వచ్చినా.. నితీష్ కుమార్ నే మళ్లీ సీఎంగా నియమించారు. నితీష్ తాజా ప్రకటనతో ఆయన ముఖ్యమంత్రి పదవిపై అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు జేడీయూ కంటే చాలా ఎక్కువగా ఉండటంతో.. ఆయన ఫ్రీగా పని చేయలేకపోతున్నారని, అందుకే అలాంటి ప్రకటన చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.