English | Telugu

ఐటీ ఉద్యోగుల భయం భయం... సీనియర్లపై వేలాడుతోన్న కత్తి..!

లక్షల్లో జీతాలు తీసుకుంటూ... వీకెండ్ వచ్చేసరికి ఎంజాయ్ మెంట్... మెజారిటీ ఐటీ ఉద్యోగుల జీవనశైలి ఇది... అయితే, ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పరిస్థితి మారింది. లక్షల్లో జీతాలు పొందుతున్నా... ముందుజాగ్రత్తగా ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అంతేకాదు వీకెండ్ పార్టీలకు గుడ్ బై చెప్పి... అవసరమైతే ఇంకో గంట ఎక్కువ సమయం ఆఫీసుకు కేటాయిస్తున్నారు. అయితే, ఇంత సడన్ ఛేంజ్ ఏంటీ అనుకుంటున్నారా? ఎందుకంటే... ఐటీ ఉద్యోగులపై ఇప్పుడు కత్తి వేలాడుతోంది. ఐటీ కంపెనీలు ఎప్పుడు ఎవర్నీ తీసేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని కంపెనీలైతే ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో భారీ కోత పెడుతున్నాయి. దాంతో, ఐటీ ఉద్యోగులంతా తమ జాబ్ ను కాపాడుకునే పనిలో పడ్డారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ యువతి తన ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడం చూస్తే సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ పరిస్థితికి అద్దం పడుతోంది.

సాధారణంగా ప్రతి ఏడాది చివరిలో ఐటీ కంపనీలు ఉద్యోగుల పని తీరును చూస్తుంటాయి. ప్రధానంగా ఒకటి నుంచి నాలుగు వరకు రేటింగ్ ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు అవేవి చూడకుండా నేరుగా ప్రాజెక్టులు లేవంటూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఐటీ కంపెనీల తీరుపై సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంక్రిమెంట్స్ లేకున్నా ఫర్వాలేదు... కానీ ఉద్యోగాల నుంచి మాత్రం తొలగించవద్దంటున్నారు ఐటీ ఉద్యోగులు. ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏడాదిపాటు ఆరోగ్య బీమాతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న కంపెనీలు.... ఏడాదికి నాలుగైదు లక్షల రేంజ్ లో జూనియర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి.

పెద్దపెద్ద ఐటీ కంపెనీలతోపాటు మధ్య తరహా కంపెనీల్లోనూ ఉద్యోగులను ఇంటికి పంపివేస్తుండటంతో వారి వేతనాలపై పడింది. తమ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం కోల్పోతే... తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు దిగులు చెందుతున్నారు. మరోవైపు సెక్సువల్ హరాస్ మెంట్ కూడా ఉంటుందని మహిళా ఐటీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించేందుకు సాకులు వెతికే బదులుగా ఉన్నవారిని మరింత మెరుగుపరిచేలా కంపెనీలు చూడాలని కోరుతున్నారు. ఇయర్ ఎండింగ్ లో వరుసపెట్టి ...ఐటీ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటనలు చేస్తుండంటో సాఫ్ట్ వేర్ ఉద్యోగులను కలవర పెడుతున్నాయి. కొత్తగా నియామకాలు చేయకపోయినా..నష్టాల తగ్గింపు పేరుతో ఉద్యోగుల తొలగించడం చట్టవిరుద్దమంటున్నారు ఐటీ ఉద్యోగులు.