English | Telugu

ఖాళీగావున్న‌సెక్రటేరియట్ ను ఐసోలేషన్ కేంద్రంగా వాడండి!

హైదరాబాద్ సెక్రటేరియట్ ఖాళీగా ఉన్నందున ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని తెలంగాణా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో COVID-19 రోగుల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితులలో, అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేసి, భయంకర కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముఖ్య‌మంత్రి తీసుకుంటున్న చర్యలను, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర శాఖ తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ లేఖ‌రాశారు. ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయ‌న స్పష్టం చేశారు.

కొంత మంది ఈ విపత్తును అవకాశంగా తీసుకొని స్వలాభం కోసం స్వార్ధంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఫలితంగా సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకొని, ధరల నియంత్రణ చేపట్టగలరని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ల‌క్ష‌ల సంఖ్య‌లో వున్న బిజెపి కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఎం.పి.బండి సంజయ్ కుమార్ తెలిపారు.