English | Telugu

ఇంటిపై బ్యాగుల నిండా డబ్బు, బంగారం! జరిగింది తెలిస్తే షాకే! 

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో వింత చోరీ ఘటన జరిగింది. తన ఇంటి యజమాని ఇంట్లో చోరీకి ప్లాన్ వేశాడు వాచ్ మెన్. ఎవరికి దొరకకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్టర్ ప్రణాళిక రచించాడు. తాను అనుకున్నట్లే అంతా పక్కాగా చేశాడు ఆ దొంగ వాచ్ మెన్. అయితే ఉహించని పరిణామాంతో అడ్డంగా బుక్కైపోయాడు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. మీరట్ లో వెలుగుచూసిన వాచ్ మెన్ చోరీ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాను ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం.. భవనంలో పనిచేసే వాచ్ మన్ తన యజమానికి సంబంధించిన డబ్బు, బంగారం దోచుకున్నాడు. దాన్నింతా బ్యాగుల్లో ఉంచి పక్కింటి డాబాపై పడేశాడు. తాను పనిచేస్తున్న ఇంటి గేటు నుంచి బ్యాగులను తీసుకెళితే సీసీ కెమెరాలకు దొరికిపోతానని భావించి, వాటిని అలా పక్కింట్లో వేశాడు. మరుసటి రోజు పక్క ఇంటిపై పడేసిన నోట్ల కట్టలు, బంగారం బ్యాగులను తీసుకుని ఉడాయించాలని భావించారు.

అయితే తెల్లారేసరికే వాచ్ మెన్ కథ అడ్డం తిరిగింది. చోరీ జరిగిన బిల్డింగ్ పక్కింట్లో నివసించే నివసించే వరుణ్ శర్మ అనే వ్యక్తి ఉదయం నిద్రలేచి ఇంటిపైకి వెళ్లాడు. ఆయనకు అక్కడ రెండు బ్యాగులు దర్శనమిచ్చాయి. బాగా బరువుగా ఉండడంతో వాటిని తెరిచి చూడగా కరెన్సీ నోట్ల కట్టలు, బంగారం కనిపించాయి. అంత పెద్దమొత్తంలో డబ్బు, బంగారం తన ఇంటిపై ఉండడంతో వరుణ్ శర్మ కంగారుపడ్డాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.

పోలీసులు వచ్చి ఆ రెండు బ్యాగులను స్వాధీనం చేసుకుని, ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. వరుణ్ శర్మ ఇంటి పక్కనే ఉన్న భవనం పైనుంచి ఆ బ్యాగులను పడేసినట్టు గుర్తించారు. పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోవడంతో వాచ్ మెన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.