English | Telugu
అల ఏపీఎస్ ఆర్టీసీలో.. అంతా అయోమయం!!
Updated : Feb 12, 2020
ఎన్ని సంస్కరణలు చేపట్టినా ఏపీఎస్ ఆర్టీసీలో నష్టాలను నివారించ లేకపోతోంది ప్రభుత్వం. వివిధ వర్గాలు ఇచ్చే రాయితీలు చార్జీల పెంపులో రాజకీయ కోణం వెరసి ఆర్టీసిని నష్టాల్లోనే కొనసాగేలా చేస్తోంది. కొత్త సర్వీసులను నడిపేందుకు ముందుకు రావడం లేదు. దీంతో యాజమాన్యం నష్టాల్ని తగ్గించుకోవటానికే అనేక రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేటు బస్సులను నడిపేందుకు అనుమతించేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఆర్టీసీ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులు దీనిపై కార్యాచరణ సిద్ధం చేసి అవి చేపట్టనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా బస్సుల్ని నడిపించడం కష్టమనే అభిప్రాయంతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఏటా వస్తున్న నష్టాలను అధిగమిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేమని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్కూల్, కాలేజీ బస్సులని ఆర్టీసీ రూట్లలో తిప్పేందుకు అనుమతి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. వివిధ సంస్థల్లో సిబ్బందిని చేరవేసేందుకు నిర్దేశించిన బస్సులకు సైతం అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ముందుగా విశాఖలో ఈ విధానాన్ని అమలు చేసి వచ్చే ఫలితాన్ని బట్టి రాష్ట్రం మొత్తం మీద అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్ధులను సిబ్బంది చేరవేసే బస్సులు మిగతా సమయాల్లో ఖాళీగా ఉంటాయి. ఆ సమయంలో బస్టాండ్ ల నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని తిరిగేందుకు ఆర్టీసీ అనుమతివ్వనుంది. సమయాన్ని బట్టి రూట్లను ఎంచుకునే అవకాశాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకే ఇవ్వనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది ప్రభుత్వంలో విలీనం కావడంతో వారికొచ్చే నష్టం ఉండదనే అభిప్రాయాన్ని కల్పించారు.
ప్రయాణికులని చేరవేయడంలో బస్సుల నిర్వహణ పై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో సమవేశాలు పూర్తయ్యాకే ముందుకొచ్చే ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సుల నిర్వహణకు అనుమతులు ఇచ్చే అవకాశమున్నట్లు తెలియజేశారు. ఆర్టీసీ ప్రతిపాదన పై కార్మిక సంఘాలు రవాణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కేవలం విద్యార్థులు సిబ్బందిని చేరవేసేందుకు మాత్రమే ఆయా బస్సులకు తాము పర్మిట్లు ఇచ్చామని దీనికి విరుద్ధంగా ప్రయాణికులను చేరవేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రైవేటు బస్సులు కాంట్రాక్టు సర్వీసులగా నిర్వహించేందుకు అనుమతులు ఉంటాయి తప్ప స్టేజి క్యారియర్ లుగా తిప్పడం సాధ్యపడదని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఆర్టీసీని నిర్వీర్యం చేసే చర్యలను తాము సమర్థించమని కార్మిక సంఘాలు కూడా హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉన్న నష్టాలను తుడిచిపెడుతుందో లేని కష్టాలను తెచ్చి పెడుతుందో అర్ధం కాక అందరిలో అయోమయం మొదలైయ్యింది.