English | Telugu

గ‌ల్ఫ్‌లో తెలుగు మహిళ రోద‌న‌.. ఇక కువైట్‌లో వుండ‌లేను స్వగ్రామానికి పంపండి

చేతిలో చిల్లిగవ్వ లేదు
ఇండియా వెళ్లాలంటే డ‌బ్బులు కావాలి
ఎపి ప్ర‌భుత్వం ఆదుకోవాలి

స్వంత‌ ఊరిలో ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకునేందుకు
ఎడారి దేశానికి వెళ్ళి రోడ్డున ప‌డిన స‌త్య‌భార‌తి.

వెస్ట్‌ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన కనుబోయిన సత్యభారతి (48) గత పదేండ్లుగా గ‌ల్ఫ్‌లో కార్మికురాలుగా పనిచేస్తున్నది. తండ్రిని కోల్పోయి, కట్టుకున్న భర్తకూ దూరమై ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఏజెంట్లు ఆడిన నాట‌కాలతో, మోసాల‌కు గురి అయింది. ఫ‌లితం పలుదేశాలు తిరిగి క్లీనింగ్‌, వంటపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది.

ఖతర్‌, దుబాయ్‌, బహ్రెయిన్‌, కువైట్‌లో పనిచేసిన సందర్భంలోనూ ఆమెకు పెద్దగా కలసిరాలేదు. ఖతర్‌లో ఉండగా మెదడులో రక్తసరఫరా సంబంధిత సమస్యతో బాధపడింది. అక్కడ ఆపరేషన్‌ చేయించుకునేందుకు డబ్బుల్లేక ఇండియాకు తిరిగొచ్చి, రాజమండ్రిలో చికిత్స చేయించుకుంది. తిరిగి వెళ్లిన తర్వాత ఓ ఇంట్లో పనిచేస్తుండగా చేయి విరగడంతో ఇండియాకు వచ్చేసింది.

అనంతరం నవంబర్‌ 12, 2019న కువైట్‌కు వెళ్లి షేక్ ఇంటిలో ప‌నులు చేస్తోంది. అయితే నాలుగు నెలలుగా వేతనం లేక కనీసం బంధువులతో మాట్లాడేందుకు కూడా డబ్బుల్లేకుండా పోయాయి.

ఆమె అకామా (రెసిడెంట్‌ స్టాంప్‌) బ్లాక్‌లో ఉంది, గ‌తంలో ప‌ని చేయించుకున్న షేక్‌లు కూడా ఈమె పై కేసులు పెట్టారు. దీంతో బాధితురాలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్ళ‌దీస్తోంది.

చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇండియా వెళ్లాలంటే సుమారు 2 లక్షల రూపాయల వరకు చెల్లించాలనడంతో బాధితురాలు బోరుమంది. త‌న‌ను గ‌ల్ఫ్‌కు పంపిన‌ ఏజెంటుకు ఫోన్‌ చేసినా వారు స్పందించ‌డం లేదు. చేసేది లేక ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న షేక్ ఇంటి నుంచి ఎలాగోలా తప్పించుకుని, తెలిసినవారి దగ్గర బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంది.

అసలే అనారోగ్యంతో బాధపడుతున్న సత్యభారతి ద‌గ్గ‌ర‌ డ‌బ్బులు లేవు. తనను స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు సాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నది.

కువైట్‌లో స్థానికంగా వుండే ఎన్జీవోలు ఆమెను ఇండియ‌న్ ఎంబసీకి అప్ప‌గించారు. ఇతరులు చేసిన త‌ప్పుల‌కు త‌న‌పై కేసులు నమోదైనట్టు ఆమె ఎంబ‌సిలో తెలిపింది. ఆమె ప్రస్తుతం ఎంబసీ అధికారుల సంర‌క్ష‌ణ‌లో ఉంది.