English | Telugu

జగన్‌కు రాజధాని రైతుల అల్టిమేటం... రాజధానిపై ప్రకటనకు డిమాండ్...

రాజధాని రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంత్రి బొత్స వ్యాఖ్యలతో ఇప్పటికే అమరావతిపై నీలినీడలు కమ్ముకోగా, అసలు రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మంత్రుల వ్యాఖ్యలతో అయోమయానికి గురవుతున్న రాజధాని రైతులు... అమరావతిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి... రోజుకో ప్రకటన చేస్తున్నారని మండిపడుతోన్న రాజధాని రైతులు... అసలు ప్రభుత్వ విధానమేంటో ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తేల్చిచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటివరకు మంత్రి బొత్స ప్రకటనలతో రైతులకు టెన్షన్ పట్టుకుంటే... ఇఫ్పుడు అమరావతి నిర్మాణానికి డబ్బుల్లేవని, అదీగాక పెద్దఎత్తున నిర్మాణం అవసరం లేదంటూ బుగ్గన ప్రకటన చేయటంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అందుకే, ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అసెంబ్లీకి సమీపంలో... రాజధాని భూముల్లో దీక్షలు చేపడతామని రైతులు హెచ్చరించారు. ఒకరోజో రెండ్రోజులో కాదు... అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ నిరసన తెలుపుతామని 29 గ్రామాల రాజధాని రైతులు ప్రకటించారు.

రాజధానిపై రోజుకో ప్రకటన చేయడంపై రైతులు మండిపడుతున్నారు. రాజధానిపై అభిప్రాయ సేకరణకు నిపుణుల కమిటీ వేయడాన్ని ఇప్పటికే హైకోర్టులో సవాలు చేసిన రైతులు....ఇప్పుడు ప్రభుత్వానికి నేరుగా అల్టిమేటం ఇచ్చారు. కమిటీ రిపోర్టుల పేరుతో రాజధానిని మారిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తాము భూములిచ్చింది పార్టీలకు కాదని, ప్రభుత్వానికని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ శీతాకాల సమావేశాల్లో సీఎం జగన్ ప్రకటన చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. మొత్తానికి బుగ్గన ప్రకటనతో రాజధాని రైతుల్లో మళ్లీ అలజడి రేగింది.