English | Telugu

ఇసుక బుక్ చేసిన ఏపీ మంత్రి ఇంటికి మట్టి!!

ఏపీలో ఇటీవల కొందరు అధికార పార్టీ నేతలు ఇసుక విషయంలో అసహనం వ్యక్తం చేస్తుంటే.. తాజాగా ఏకంగా ఓ మంత్రికే ఇసుక విషయంలో చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లి సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇల్లు కట్టుకొంటున్నారు. మంత్రి ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేశారు. ఏపీఎండీసీ అధికారులు నాలుగు లారీల ఇసుకను తరలించారు. అయితే, ఆ ఇసుక నాసిరకంగా ఉంది. అందులో ఇసుక కన్నా తువ్వ, మట్టే ఎక్కువగా ఉంది.

దీనిపై ఇంటి పనులు చేస్తున్న నిర్వాహకులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి ఇసుక సరఫరాలో లోపాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతో ఆర్డీవో భవానీశంకర్, పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ రాంబాబు వెళ్లి.. ఇసుక గుట్టలను పరిశీలించారు. ఆ ఇసుక ఎటువంటి నిర్మాణాలకూ పనికిరాదని, కేవలం పునాదుల్లో వేయడానికి ఉపయోగపడుతుందని కలెక్టర్‌కు నివేదించారు. మంత్రికే ఇలాంటి నాసిరకం ఇసుక పంపితే.. సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడు నెలల నుంచి సామాన్యులకు కూడా ఇదే తరహా పనికిరాని ఇసుకను సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమస్య మంత్రి దాకా రావడంతో అధికార యంత్రాంగం కదిలిందని అంటున్నారు.