English | Telugu

ఒక్కరోజు దీక్షకు పది కోట్లా.. చంద్రబాబు దీక్షల గుట్టు తేలిపోనుంది!!

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. కేంద్రప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ ‘ధర్మపోరాట దీక్ష’లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇవి 'ధర్మపోరాట దీక్ష'లు కాదు, 'ధనవృథా దీక్షలని' అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 11న చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఒక్కరోజు ‘ధర్మపోరాట దీక్ష’కు రూ.10 కోట్లు వ్యయం చేయడంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే ఈ విషయంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది.

చంద్రబాబు ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్షకు ప్రభుత్వం నుంచి రూ. పది కోట్లు ఖర్చు పెట్టారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే అంశంపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సూర్యనారాయణరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. పార్టీ తరపున చేసిన కార్యక్రమానికి రూ. పది కోట్ల ప్రజాధనం వ్యయం చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ జీవోను జారీ చేసిన అధికారి ఎవరో చెప్పాలని, ఏ నిబంధనల మేరకు జీవో విడుదల చేశారో చెప్పాలని నిలదీసింది. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాకు ఇంత భారీ స్థాయిలో ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.

బీజేపీతో కటీఫ్ చెప్పిన తర్వాత టీడీపీ ప్రతీ జిల్లాలోనూ ధర్మపోరాట దీక్షలు చేసింది. దానిపై అప్పట్లోనే విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కోట్లు ఖర్చు పెట్టి రాజకీయ దీక్షలు చేస్తున్నారని విరుచుకుపడ్డాయి. అయితే, టీడీపీ మాత్రం ఆ దీక్షలన్నీ.. పార్టీ పరంగా చేసుకుంటున్నవేనని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ ధర్మపోరాట దీక్ష కోసం చేసిన ఖర్చుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ ధర్మపోరాట దీక్ష ఖర్చుపై పూర్తి రికార్డులు ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. నిజంగానే ధర్మపోరాట దీక్షలకు ప్రభుత్వం తరపున ఖర్చు చేసి ఉంటే చంద్రబాబు చిక్కుల్లో పడిపోతారు. ఒకవేళ పార్టీ పరంగా నిర్వహించుకుని ఉంటే మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారమని తేలిపోతుంది. ఏదిఏమైనా కొద్దిరోజుల్లో నిజం తేలిపోనుంది.