English | Telugu
ఇంకా కనిపించని రమ్య మృత దేహం?
Updated : Oct 25, 2019
బోటు ప్రమాదంలో గల్లంతైన ఇంజనీర్ రమ్య ఆనవాళ్లు ఇంకా దొరకలేదు. బిడ్డ కడచూపు కోసం తల్లిదండ్రులు రోజుల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు లభించిన మృతదేహాల్లో రమ్యకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నన్నూరు గ్రామానికి చెందిన కారుకూరి సుదర్శన్, భూలక్ష్మి దంపతులకు కుమార్తె రమ్య, కుమారుడు రఘు ఉన్నారు. సుదర్శన్ విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ గా పని చేస్తుండగా భార్య గృహిణి, కుమార్తె రమ్య బీటెక్ పూర్తి చేసి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించింది.
విధుల నిమిత్తం వరంగల్ వెళ్లి అక్కడ నుంచి పాపికొండల విహార యాత్రకు తోటి స్నేహితులతో కలిసి వెళ్ళింది. యాత్రలో భాగంగా వారు వెళ్లిన రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునగడంతో అంతా గల్లంతయ్యారు. రమ్యతో పాటు వెళ్లిన మరో సహచర ఉద్యోగి లక్ష్మణ్ మృతదేహం అదే రోజు లభించింది. ఇక అప్పట్నుంచీ ఇప్పటి వరకూ రమ్య ఆచూకీ మాత్రం లభించలేదు. కుమార్తె జాడ కోసం తండ్రితో పాటు కుటుంబ సభ్యులు చాలా రోజుల పాటు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గరే గడిపారు. బోటు ప్రమాదానికి సంబంధించిన ఏ మృతదేహం కనిపించినా తమ బిడ్డ దేమోనని ఆశపడ్డారు. మృతదేహం దొరక్క పోవడంతో రాజమండ్రి గోదావరి తీరాన గత నెల ఇరవై ఐదు న కర్మకాండలు నిర్వహించారు.
ఇటీవల బోటును వెలికితీయడంతో రమ్య తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు మళ్లీ రాజమండ్రికి వెళ్లారు. బోటులో లభ్యమైన మృతదేహాలలో రమ్య మృతదేహం కానరాలేదు. దీంతో సుదర్శన్ దంపతులు మరింత రోదిస్తున్నారు. తమ బిడ్డ మృతదేహం దొరికితే చాలని ఎదురుచూస్తున్నారు. గోదారమ్మా కరుణించి తమ బిడ్డ పార్ధివదేహాన్ని తమకు ఇవ్వాలని నిత్యం గోదారమ్మను వేడుకుంటున్నారు. పడవలో మరికొన్ని మృతదేహాలు ఉన్నాయని వాటిని జాగ్రత్తగా బయటకు తీసి ఆసుపత్రికి పంపిస్తామని అధికారులు చెప్పడంతో రమ్య కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అంతా రాజమండ్రి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. బిడ్డను కడసారి చూసుకోవాలన్న ఆవేదనతో గుండెలు బాదుకుని రోదిస్తున్నారు.