English | Telugu
వైఎస్ వివేకా హత్యకేసుపై హైకోర్టు సంచలన నిర్ణయం
Updated : Mar 11, 2020
మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించింది. సిట్ నివేదికను 2 సీల్డ్ కవర్లలో న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలను కోర్టు కొట్టి వేసింది. అనంతరం కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు వేసిన పిటిషన్లపై హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి వేసిన పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది.
ఏడాది దాటినా కేసును సిట్ చేధించలేదన్న న్యాయస్థానం. కేసులో అంతరాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందన్న న్యాయమూర్తి. ఇతర రాష్ట్రాల నిందితులను పట్టుకునే శక్తి సామర్ధ్యాలు సిబిఐ కి ఉందని న్యాయస్థానం అభిప్రాయ పడింది. పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది..
2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన సొంత ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత బాబాయి అని వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం రాజకీయంగా పెను సంచలనానికి దారితీసింది. ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్య వెనుక పలు రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అప్పట్లో వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సిట్ విచారణ వేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జగన్ ప్రభుత్వం కూడా వైఎస్ వివేకా హత్య కేసును సిట్‌తోనే విచారించాలని నిర్ణయించింది.
అయితే, వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబసభ్యులు మాత్రం ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు ఈ కేసులో ప్రమేయం ఉందని వైసీపీ ఆరోపించిన టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి కూడా ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, సీబీఐ విచారణ అవసరం లేదని, సిట్ విచారణ చివరి దశకు వచ్చిందని జగన్ ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. కానీ, కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది కావస్తున్నా ఇంకా బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు బాగా పెరిగాయి. అయినా వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై జగన్ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. అయితే హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోవడం ఎపిలో చర్చనీయంశంగా మారింది.