English | Telugu

జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. పది రోజుల్లో వైసీపీ రంగులు తొలగించాలని ఆదేశం...

ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ఎప్పట్నుంచో వివాదం కొనసాగుతోంది. చెత్త కుండీలను కూడా వదలకుండా వైసీపీ రంగులు వేశారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పెద్దఎత్తున విమర్శలు చేసింది. అంతేకాదు, ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ భవనాలు, పంచాయతీ కార్యాలయాలపై రాజకీయ పార్టీల రంగులు తొలగించాల్సిందేనని ఆదేశించింది. ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు పది రోజుల్లోగా కొత్త రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ప్రభుత్వ భవనాలపై రాజకీయ పార్టీల రంగులను తొలగించినట్లు ఆధారాలతో సహా తమకు నివేదిక సమర్పించాలని సీఎస్ ను ఆదేశించింది.

ఇదిలా ఉంటే, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు ఉండటంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కూడా సరైన సమాధానం చెప్పకుండా మాట దాట వేశారు. అయితే, మార్చి 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు... 23న మున్సిపోల్స్... 27, 29న పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలోనే.... కొత్త రంగులు వేయడానికి హైకోర్టు పది రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి, ఈ పది రోజుల సమయంలో... ప్రభుత్వం కొత్త రంగులు వేయగలుగుతుందో లేదో? ఒకవేళ హైకోర్టు ఆదేశాలు అమలుకాకపోతే... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.