English | Telugu

ముందు అపాయింట్ మెంట్ లెటర్లు... ఆ తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్...

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. అక్టోబర్ రెండు నుంచి గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు విజయవాడలో నియామక పత్రాలు అందజేయడంతోపాటు, వారినుద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు.

అలాగే, జిల్లాల్లో మంత్రులు... నియామక పత్రాలు అందజేయనున్నారు. నియామక పత్రాల్లో కేవలం ఉద్యోగానికి ఎంపికైనట్లు మాత్రమే తెలియజేస్తారు. పోస్టింగ్ ఆర్డర్లు ఆ తర్వాత అందజేస్తారు. ఎంపికైన ఉద్యోగులకు వారు కోరుకున్న విధంగా, జిల్లా-మండల పరిధిలోనే పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే, సొంత గ్రామంలో మినహా ఉద్యోగులు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించారు. పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు.