English | Telugu
అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Updated : Feb 25, 2020
ఏపీ రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పేదలకు ఇళ్లస్ధలాలు ఇచ్చేందుకు వీలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 54 వేల 307 మంది పేదలకు అవసరమైన 1251.5 ఎకరాలను ఉగాది నాటికి ఇళ్లస్ధలాలుగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటి ప్రకారం విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, పెదకాకాని మండలాల్లో ఉన్న ప్రజలకు రాజధానిలోని మందడం, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నవులూరు గ్రామాల్లో స్ధలాలు పంపిణీ చేయనున్నారు.
అమరావతి రాజధాని రైతులకు ఏపీ సర్కారు మరో చేదు కబురు అందించింది. ఇప్పటికే రాజధాని తరలింపు నేపథ్యంలో ప్రతీ రోజూ ఆందోళనలకు దిగుతున్న రాజదాని ప్రాంత రైతులకు వారు ప్రభుత్వానికి గతంలో అప్పగించిన భూములను తిరిగి పేదలకు పంచాలని సర్కారు నిర్ణయించడం మింగుడు పడని వ్యవహారమే. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఒక్కొక్కరికి ఒక్కో సెంటు స్ధలం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కార్పోరేషన్ పరిధిలోని 28, 952 మంది, తాడేపల్లి మండలంలోని 11,300 మందికి, మంగళగిరి మండలంలోని 10,247 మందికి, దుగ్గిరాలలో 2500 మందికి, పెదకాకానిలో 1308 మందికి ప్రభుత్వం ఉగాది రోజు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయబోతోంది.