English | Telugu

జగన్ సర్కార్ కి గట్టి షాక్.. కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దు చేసిన క్యాట్!

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ వ్యవహారంలో ఏపీ సర్కారుకు క్యాట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలపై కృష్ణకిషోర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇవాళ క్యాట్ కొట్టేసింది. అంతే కాకుండా కృష్ణ కిషోర్ ను కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కృష్ణకిషోర్ పై ఉన్న కేసును చట్టపరంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉందని క్యాట్ తన ఆదేశాల్లో పేర్కొంది.

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవోగా వ్యవహరించిన ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ ను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేసింది. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ అచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణకిషోర్ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించి ప్రభుత్వం గతంలో సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవోగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ అనుమతి లేకుండా కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేశారని కృష్ణకిషోర్ పై ఆరోపణలు వచ్చాయి. వీటని విచారించిన ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని కృష్ణ కిషోర్ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ లో సవాలు చేశారు. విచారణ జరిపించిన క్యాట్ సస్పెన్షన్ ఆదేశాలను రద్దు చేయడంతో పాటు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చింది. అదే సమయంలో కృష్ణ కిషోర్ పై నమోదైన కేసును చట్టప్రకారం విచారించుకోవచ్చని స్పష్టం చేసింది.