English | Telugu

అమిత్ షాతో మాట్లాడటం కుదరలేదు.. విజయసాయిపై జగన్ తీవ్ర అసహనం!!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా మంగళవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన జగన్.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నేతలు, సహచర మంత్రులతో అమిత్‌షా కార్యాలయం కోలాహలంగా మారింది. దీంతో అమిత్‌షాతో మాట్లాడేందుకు జగన్‌కి తగిన సమయం దొరకలేదు.

అమిత్‌షాతో పూర్తిగా మాట్లాడే అవకాశం చిక్కకపోయేసరికి జగన్‌ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డిపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిజానికి అమిత్ షా తో భేటీ జగన్ కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్నారు. అపాయిట్మెంట్ దొరకడంతో అమిత్ షాని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే, 24 గంటలు వెయిట్‌ చేసినా పూర్తిస్థాయి మీటింగ్ జరగలేదనే అసహనం జగన్‌లో కనిపించిందని సన్నిహితులు చెబుతున్నారు. కాగా.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పుడు అమిత్ షాతో అపాయిట్మెంట్ మొదలుకుని భేటీ వరకూ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. అయితే భేటీ సక్రమంగా జరగకపోవడంతో విజయసాయిరెడ్డిపై జగన్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

మరోవైపు.. జగన్‌తో అపాయింట్‌మెంట్లని కేంద్ర మంత్రులు రవిశంకర్‌, ప్రహ్లాద్‌జోషి రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. కేంద్ర మంత్రులు అపాయిట్మెంట్ రద్దు చేసుకోవడంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం జగన్ ఢిల్లీ పర్యటన గురించి స్పందించింది. ఏపీ సమస్యలపై అమిత్‌షాకు జగన్‌ వినతిపత్రం ఇచ్చారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, కడప స్టీల్‌ప్లాంట్ లాంటి అంశాలు మెమోరాండంలో జగన్‌ ప్రస్తావించారని సీఎంవో వర్గాలు తెలిపాయి.