English | Telugu

జగన్ సర్కారుకు మరో షాక్... ఏపీ ఫైబర్ నెట్ కు భారీ జరిమానా

ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు న్యూస్ ఛానెళ్ల అనధికార నిషేధంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ మండిపడింది. పదేపదే ఆదేశాలిచ్చినా ఆ ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతకు కారణాలు చూపకపోవడం, అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఏపీ ఫైబర్ నెట్ పై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఛానెల్ ప్రసారాల నిలిపివేతపై టీవీ5 యాజమాన్యం... టీడీశాట్ ను ఆశ్రయిండంతో అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. అయితే, ప్రసారాలు పునరుద్ధరించాలని పదేపదే ఉత్తర్వులిచ్చినా ఎందుకు పట్టించుకోలేదంటూ ఏపీ ఫైబర్ నెట్ కి భారీ జరిమానా విధించింది. ఛానెల్ పై నిషేధం ఎత్తివేసేంతవరకు రోజుకి రెండు లక్షల చొప్పున చెల్లించాలంటూ ఆదేశించింది. అలాగే, తమ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు కూడా ఏపీ ఫైబర్ నెట్ కి భారీ జరిమానా విధించింది.

ఉద్దేశపూర్వకంగానే ఛానెళ్లపై నిషేధం విధించినట్లు భావిస్తున్నామని టీడీశాట్ వ్యాఖ్యానించింది. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము చేస్తున్నామన్న ఏపీ ఫైబర్ నెట్ పై ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. మీకు ఆదేశాలిస్తున్న ఆ ఉన్నత వ్యక్తి ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించింది. మీడియా సంస్థలకు ఉండు భావప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వ సంస్థలు ఉల్లంఘించడం ప్రమాదకరమని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక, ఇప్పటివరకు జరిగిన ఉల్లంఘనలకు 15లక్షల రూపాయల జరిమానా విధించాల్సి ఉన్నప్పటికీ, కేవలం 5లక్షలు మాత్రమే విధిస్తున్నట్లు ట్రిబ్యునల్ ప్రకటించింది

టీడీశాట్ ఆదేశాలు ఇలాగుంటే, ప్రభుత్వ పెద్దలపైనే ఆ రెండు న్యూస్ ఛానెళ్లు ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ సర్కారు ఒత్తిడితోనే ఎంఎస్ వోలు ప్రసారాలను నిలిపివేశారని, మంత్రులే స్వయంగా ఆపరేటర్లపై బెదిరింపులకు దిగారని అంటున్నాయి. ఒక ఛానెల్ అయితే, ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డినే నేరుగా టార్గెట్ చేస్తోంది. ఆ ఛానెల్ కనిపించడానికి అసలు వీల్లేదంటూ స్వయంగా జగనే హుకుం జారీ చేశారని చెబుతోంది. మరి, ఈ ఛానెళ్ల నిషేధం వివాదం ఎక్కడివరకు పోతుందో చూడాలి.