English | Telugu

సీఎం జగన్‌ నోట కొత్త జిల్లాల ఏర్పాటు మాట

ఏపీలో జిల్లాల సంఖ్య పెరగనుందని తెలుస్తోంది. స్పంద‌క కార్య‌క్ర‌మంపై రివ్యూ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా సీఎం జగన్‌ నోట కొత్త జిల్లాల ఏర్పాటు మాట వచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచన ఉందని సీఎం తెలిపారు. సీఎం మాట‌ల‌ను బట్టి చూస్తే 13 జిల్లాల ఏపీ.. 25 జిల్లాలుగా మార‌బోతుంది. మరోవైపు, ఇప్ప‌టికే కొత్త జిల్లాల‌పై అధికారులు క‌స‌ర‌త్తులు ప్రారంభించారని తెలుస్తోంది. కొత్త జిల్లాల‌తో పాటే రెవెన్యూ డివిజ‌న్లు, కొత్త మండ‌లాల‌ను కూడా ప్ర‌క‌టించ‌బోతున్నారని సమాచారం.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొలువుదీరిన టీఆర్ఎస్ సర్కార్ పది జిల్లాలను కాస్తా 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఏపీలో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. కొత్త జిల్లాల ఏర్పాటు పై గతంలోనే సీఎం జగన్ అధికారులతో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, వివిధ కారణాల చేత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. అయితే, తాజాగా కొత్త జిల్లాల అంశాన్ని జగన్ మరోసారి ప్రస్తావించడంతో.. ఈ అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.