English | Telugu
టెన్త్ విద్యార్ధులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం
Updated : Mar 7, 2020
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టెంత్ విద్యార్ధినీ, విద్యార్ధులకు షాకిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి పరీక్షల తేదీలను ఖరారు చేశారు.
ఏపీలో పదవతరగతి పరీక్షల కొత్త టైంటేబుల్ ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. యధావిధిగా అయితే ఇంటర్ పరీక్షలు తర్వాత టెన్త్ పరీక్షలు మొదలుకావాల్సి ఉంది. కానీ ఇంటర్ తరువాత ఎన్నికల వ్యవహారాన్ని చక్కబెట్టి ఏప్రిల్ నెలలో టెన్త్ పరీక్షలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది.
ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. ఉ.9:30 నుంచి మ.12:15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్, ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1, 6న ఇంగ్లీష్ పేపర్-2, ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1, 8న పేపర్ -2, ఏప్రిల్ 9న జనరల్ సైన్స్ పేపర్-1, 11న పేపర్-2 పరీక్ష వుంటుంది.
ప్రస్తుతం ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ఎలాగయినా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. దీనికి కారణం.. స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడాది గడచిపోయింది. మార్చి 31 లోపు ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికసంఘం నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. ఒకవేళ ఆలస్యంగా ఎన్నికలు జరిగి నిధులు రావాలంటే కేంద్రాన్ని కాళ్ళు, గడ్డాలు పట్టుకోవాల్సి వస్తుంది.
అసలే జగన్ నిర్ణయాలతో కేంద్రంలో మంత్రులు ఆగ్రహంతో ఉండగా రాష్ట్రంలో చేతిలో ఉండగా వదిలేసి గడువు తర్వాత కేంద్రాన్ని బ్రతిమిలాడుకోవడం ఎందుకనుకుంటే ఈ నెలలో ఎన్నికలు జరిపి తీరాల్సిందే. ఇప్పుడు ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్రానికి చాలా కీలకం అవసరం కూడా. అయితే పరీక్షల సమయానికి ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది.
స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోలేకపోయింది. పరీక్షలు.. ఎన్నికలను అంచనా వేయలేకపోయిది. ఫలితంగా రాష్ట్రంలోని ఏడు లక్షల మంది టెన్త్ విద్యార్థులకు నెల రోజుల పాటు టెన్షన్ మిగిలింది. ప్రతి విద్యార్థి టెన్త్ పరీక్షలు, ఫలితాలు జీవితంలో అత్యంత కీలకం. అలాంటి వారికి ప్రభుత్వం పెట్టిన పరీక్షగా ఈ పరిణామాన్ని చెప్పుకోవాలి.
ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తే ఇంటర్ పరీక్షలను కూడా వాయిదా వేసేది. కానీ ప్రభుత్వనికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇంటర్ పరీక్షలకు అనేక జాతీయ ప్రవేశ పరీక్షలకు లింకు ఉంటుంది. జాతీయ స్థాయి పరీక్షలకు, వాటి షెడ్యూల్ కు ముందే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో ఇంటర్ పరీక్షలు జరిపించక తప్పలేదు.
ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలకు వైసీపీ గ్రామకార్యకర్తలు అనబడే ఒక్క అర్హత కలిగిన గ్రామ వాలంటీర్లను ఇన్విజిలేషన్ కు నియమిస్తామని విద్యార్థుల వీపున జగన్ సర్కార్ బండ వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పడు టెన్త్ పరీక్షలను ఒక నెల రోజులు పొడగించి విద్యార్థుల కీలకమైన జీవితంలో నెల రోజుల కాలాన్ని రాజకీయాల కోసం, ఎన్నికల కోసం పణంగా పెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వమే దక్కించుకుంది.