English | Telugu
సి.ఎం. జగన్ జడ్జిలకు కూడా కులం ఆపాదిస్తారేమో!
Updated : Mar 18, 2020
సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో టిడిపి నేతలు సెటైర్లు వేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. తనకు అనుకూలంగా లేరని ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా తీర్పు సి.ఎం.కు అనుకూలంగా రాలేదు. అయితే అక్కడ కూడా కులమే పనిచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పిందా అని టిడిపి నేత అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ఇప్పుడు జడ్జిలకు కూడా ‘కులం’ ఆపాదిస్తాడేమోనని భయంగా ఉందంటూ సెటైర్లు విసిరారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదించిన జగన్ ఇప్పుడు ఎవరికి ఆపాదిస్తారు? ఎన్నికల కోడ్ ను సడలించడాన్ని కూడా స్వాగతిస్తున్నామని, కొత్త పథకాలు వద్దని సుప్రీంకోర్టే చెప్పిందని, దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు.
విదేశాల్లో ఉండే ఆంధ్రులు విమానాశ్రయాల్లో విలపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టట్లేదని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి రాజకీయాలు పక్కన పెట్టి కరోనా నుంచి రాష్ట్ర ప్రజల్ని, అలాగే విదేశాల్లో చిక్కుకున్న ఆంధ్రులను కాపాడడానికి దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.