English | Telugu

జగన్ సర్కార్ కి కోర్టులో మరో మొట్టికాయ పడనుందా?.. పాపం సీఎస్!!

జగన్ సర్కార్ కు కోర్టులలో వరుసగా అక్షింతలు పడుతున్నా కానీ ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం తో రాష్ట్ర ఉన్నతాధికారులు కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమకు నచ్చిన సలహాదారులు, అధికారుల నియామకం విషయంలో చూపించిన వేగం కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేసే విషయంలో చూపడం లేదు.

చంద్రబాబు ప్రభుత్వం లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఎబి వెంకటేశ్వరరావు ను జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనికి వ్యతిరేకంగా అయన హైకోర్టు ను ఆశ్రయించగా విచారణ జరిపి సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఎబి కి రావాల్సిన శాలరీని చెల్లించాలని, అలాగే ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఐతే ఎప్పటిలోగా పోస్టింగ్ ఇవ్వాలనే విషయం మాత్రం స్పష్టం చేయలేదు. ఐతే కోర్టు తీర్పు వచ్చిన తరువాత తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఎబి హైకోర్టు తీర్పు ను కూడా జత చేస్తూ సీఎస్ కు వినతి పత్రం అందచేశారు.

ఐతే కోర్టు తీర్పు వచ్చి 20 రోజుల పైగా గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. దీంతో ఎబి వెంకటేశ్వరరావు అనేక పర్యాయాలు తన పోస్టింగ్ గురించి గుర్తు చేస్తూ సీఎస్ కు లేఖ రాసినా ఇప్పటివరకు అటు నుండి ఎటువంటి రిప్లై లేదని సమాచారం. దీని పై ఎబి మళ్ళీ కోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే ఇప్పటికే ఒకసారి కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు కు హాజరైన సీఎస్ మరో సారి అదే పని చేయవల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే హైకోర్టు సుప్రీం కోర్టుల్లో మొట్టికాయలు తిన్న ఎపి సర్కార్ కు మరోసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు. మరో వైపు రాజకీయ నాయకుల తొందరపాటు నిర్ణయాలతో ఉన్నతాధికారులుగా తాము కోర్టు మెట్లెక్కవలసి రావడం తో అధికారులలో కొంత అసంతృప్తి నెలకొంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఎబి విషయం లో నిర్ణయం తీసుకుంటుందా లేక కథ మళ్ళీ మొదటికి వస్తుందా వేచి చూడాలి.