English | Telugu

మహారాష్ట్ర, హర్యానా ఫలితాలతో బీజేపీ పరేషాన్.. జమిలీ తప్పేలా లేదు!!

రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ పునరాలోచనలో పడింది. ఒకటి ఉత్తరాది రాష్ట్రం, మరొకటి పడమటిది. కాగా రాష్ట్రాలలో వేర్వేరు రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీకి వచ్చిన ఫలితం మాత్రం ఒక్కటే. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది కానీ భారీ మెజారిటీ మాత్రం రాలేదు. హర్యానాలో మెజారిటీ తగ్గి హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. మోదీ నాయకత్వం, అమిత్ షా మంత్రాంగం, ఫడ్నవీస్, కఠారి లీడ్ పనిచేసి ఎక్కడికో వెళ్తామని అనుకుంటే ఉన్నచోటే ఉన్నట్టుగా తయారైంది పార్టీ పరిస్థితి. జాతీయవాదంతో ప్రత్యర్ధులను ఓడిద్దామనుకుంటే ఆర్టికల్ 370 రద్దుతో ఓట్ల పంట పండుతుందని అనుకుంటే అంచనాలూ తారుమారయ్యాయి. సెంటిమెంట్ తో కొట్టాలనుకున్న ప్రయత్నం ఫలించలేదు. హర్యానాలో జాట్ల సెంటిమెంట్ ముందు జాతీయవాదం పనిచేయలేదు. మహారాష్ట్రలో గ్రౌండ్ రియాలిటీ బిజెపికి అనుకూలంగా లేవన్న విషయం అర్థమైపోయింది. శరద్ పవార్ చెప్పింది కూడా అదే. విపక్షాలు గెలవకపోయినా బీజేపీ బలం మాత్రం తగ్గుతుంది.

ఫలితాలపై బిజెపి విశ్లేషణ మొదలైంది. అనుకూలమనకున్న పరిస్థితులు ప్రతికూలంగా మారటానికి కారణమేంటన్న ప్రశ్న తలెత్తింది. ప్రాంతీయ పరిస్థితులే తప్ప జాతీయవాదం వేర్వేరు రాష్ట్రాల ఎన్నికల్లో పనిచెయ్యదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎప్పుడూ అనుకూలతలు ఉండవని ప్రతి ఎన్నికకూ పరిస్థితులు మారతాయని బిజెపి అర్థం చేసుకుంది. ఇప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందుకు నడిస్తేనే అధికారంలో కొనసాగే వీలుంటుందని గుర్తించింది. అందుకే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలోపే మరోసారి లోక్ సభ ఎన్నికలు నిర్వహించి ఐదేళ్ళపాటు అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. జమిలీ ఎన్నికల ఆలోచన బిజెపిలో చాలా రోజులుగా ఉన్నదే. 2023 నాటికి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే వరుసగా మూడు సార్లు గెలిచిన కాంగ్రెసేతర పార్టీగా కూడా రికార్డులకెక్కే వీలుంటుందని బిజెపి భావిస్తోంది. జమిలి ఎన్నికలతో రాష్ట్రాల్లోనూ బలమైన శక్తిగా అవతరించే వీలుంటుందని నమ్ముతోంది.

గతంలో చాలాసార్లు జమిలీ ఎన్నికలపై చర్చ జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జమిలీ మాట మరుగున పడిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఫలితాలూ కొత్త అనుమానాలకు తావిచ్చాయి. విపక్షాలు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చూడాలంటే జమిలీ కూడా ఒక మార్గమని బిజెపి నమ్ముతోంది. 2024 మధ్యలో సాధారణ ఎన్నికలు నిర్వహించేకంటే 2023 జనవరి, ఫిబ్రవరి లోనే జమిలీ ఎన్నికలు పూర్తి చేస్తే పరిణామాలు తమకు అనుకూలంగా ఉంటాయని బిజెపి విశ్వాసం. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా ఆ విషయాన్ని నిర్భయంగా ప్రస్తావించారు. బిజెపి ఇప్పుడు ద్విముఖ వ్యూహంతో కదుల్తోంది. త్వరలో జరగబోయే కీలక రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడం మొదటి వ్యూహం.కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలను బలపడకుండా చూసుకుంటూ జమిలీ ఎన్నికలకు సిద్ధం కావడం రెండో వ్యూహం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు మీద నేరుగా పాకిస్థాన్ మీద సర్జికల్ దాడులు జరిపింది. రెండు రాష్ట్రాల పోలింగ్ ముందు రోజు ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడులు జరిపింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలోని విపక్షాలపై సర్జికల్ దాడులు చేయాలని అనుకుంటోంది. అదే జమిలి ఎన్నికలు. ప్రతిసారీ మోదీ వ్యూహాలు పని చేయని పరిస్థితులు వస్తే అప్పుడు ఇబ్బందులు ఎదురుకాకుండా కాస్త ముందే ఎన్నికలు పూర్తి చేయాలని తీర్మానించుకుని ఉండొచ్చన్నది ఒక వాదన.