English | Telugu
ఎట్టకేలకు మీడియా ముందుకు ఉండవల్లి... జగన్ కు సూచనలు-హెచ్చరికలు
Updated : Oct 2, 2019
చంద్రబాబు హయాంతో మాటిమాటికీ మీడియా ముందుకొచ్చి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా మీడియా ముందుకు ఎందుకు రాలేదంటూ అనేక విమర్శలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకవైపు ఇసుక విధానం ఆలస్యం... మరోవైపు ఇసుక కొరత కారణంగా దాదాపు 50లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడి అల్లాడిపోతుంటే... ఈ మేధావి ఎందుకు మీడియా ముందుకొచ్చి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని నిలదీసినవాళ్లున్నారు. రివర్స్ టెండరింగ్, పీపీఏల సమీక్ష, పోలవరం ప్రాజెక్టు వివాదం, రాజధాని అమరావతి గొడవ, విద్యుత్ కోతలు, ఆశావర్కర్ల ఆందోళనలు, రాజకీయ వేధింపులు... ఇలా వంద రోజుల్లో వందకు పైగా అరాచకాలు చేశారంటూ ఒకపక్క విపక్షాలు... మరోపక్క ప్రజలు గగ్గోలు పెడుతుంటే... ఈ మేధావి అసలెందుకు ఒక్క చిన్న ప్రెస్ మీట్ పెట్టి తన వాయిస్ ఎందుకు వినిపించలేదని ఎంతోమంది ప్రశ్నించారు. చివరికి ఉండవల్లిపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా సర్క్యులేట్ అయ్యాయి. మరి ఇవన్నీ ఉండవల్లికి చేరాయో లేదో తెలియదు గానీ మొత్తానికి జగన్ పరిపాలనపై తన ఫస్ట్ రియాక్షన్ బయటపెట్టారు.
జగన్ పాలనపై ఇప్పటివరకు పొగిడేందుకు గాని.... తిట్టేందుకు కానీ ఏమీ లేదంటూ సేఫ్ సైడ్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, అలాగని అంతా బాగుందని చెప్పడానికి కూడా లేదంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. అయితే, ఇసుక కొరత, విద్యుత్ కోతలు జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయని అన్నారు. ఇక, నవరత్నాల అమలులో ఏ చిన్న తేడా వచ్చినా తీవ్ర ప్రజావ్యతిరేకత తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. పీవీ, ఎన్టీఆర్ కూడా 50శాతానికి పైగా ఓట్లతో ముఖ్యమంత్రులైనా తొమ్మిదే తొమ్మిది నెలల్లో దిగిపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇప్పుడు జగన్ నైనా దింపేస్తారంటూ చరిత్రను గుర్తుచేస్తూ కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడున్న 151మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని... ఇదే శాశ్వతమని భావించొద్దని జగన్ ను హెచ్చరించారు. ప్రజల్లో మంచి పేరుతోపాటు ఎమ్మెల్యేల మనసు కూడా గెలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి... తమ మాటను వింటున్నారనే విశ్వాసం ఎమ్మెల్యేల్లో కలగాలన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోతే పీవీ నర్సింహరావు, ఎన్టీ రామారావుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు.
ఇక, ఇసుక కొరత, విద్యుత్ కోతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్న ఉండవల్లి... కారణాలు ఏమైనప్పటికీ ప్రజలకు అవసరం లేదని, అంతిమంగా ఫలితమే ముఖ్యమన్నారు. అలాగే, నవరత్నాల్లో ఏ ఒక్కటి అమలు జరగకపోయినా సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమన్నారు. ఇక, ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యవస్థలు సరిగా లేవన్న ఉండవల్లి... ముందు వాటిని సరిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. మొత్తానికి కొంత బ్యాలెన్స్ డ్ గా ఉండవల్లి తన ఫస్ట్ రియాక్షన్ ను బయటపెట్టారు. ఒకపక్క సూచనలు ఇస్తూనే... మరోపక్క హెచ్చరించారు.