English | Telugu
ఆ ఎమ్మెల్యే గారికి కాస్త ఎవరైనా చెప్పండయ్యా!!
Updated : Mar 20, 2020
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీరు వివాదాస్పదంగా మారింది. కోనప్ప దంపతులు ఈ నెల 16న అమెరికా నుంచి వచ్చారు. అయితే ఆయన క్వారంటైన్లో లో ఉండలేదు. కనీసం బయట వారిని కలవకుండా హౌస్ క్వారంటైన్ లోనూ ఉండట్లేదు. మాస్క్ కూడా పెట్టుకోకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. అమెరికా నుండి వచ్చిన మరుసటి రోజే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అంతేనా.. ఒకవైపు ప్రభుత్వాలు.. వివాహాలు-వేడుకలు వాయిదా వేసుకోమని చెప్తుంటే.. ప్రజలకు అవగాహన కలిగించాల్సిన స్థానంలో ఉన్న కోనప్ప మాత్రం.. బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతం, వివాహాలకు హాజరయ్యారు. ఇలా విదేశాల నుంచి వచ్చి కనీసం మాస్క్ కూడా లేకుండా, ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా.. ఓ ఎమ్మెల్యే ఇలా తిరగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో అన్ని పరీక్షలు చేశారని.. ఆరోగ్యంగా ఉన్నందున క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని కోనప్ప చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే, వైరస్ సోకిన వెంటనే గుర్తించలేమని.. కనీసం మూడు నాలుగు రోజుల తరువాత లక్షణాలు బయటపడతాయని.. అందుకే అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారు ఇవేమి పట్టనట్టు సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడిలా ఊరంతా తిరుగుతున్నారు. అధికార పార్టీ పెద్దలైనా ఆయనకు హితబోధ చేస్తే బావుండు.