ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టెది మరో దారి అని ఫేమస్ తెలుగు సామెత. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఈ సామెతకు చక్కగా సరిపోతుంది. ఒక పక్క అమెరికాను కరోనా వణికిస్తున్నా కూడా ప్రజలందరికి ఆదర్శంగా ఉండాల్సిన ట్రంప్ మాత్రం పేస్ మాస్క్ వాడడానికి నిరాకరించి తీవ్ర విమర్శల పాలయ్యారు. అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం అయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా అయన పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ లకు పెద్ద తలనొప్పిగా తయారైనట్లుగా కనిపిస్తోంది. తాజాగా అయన పెట్టిన మరో పోస్టును అవి తొలగించాయి. తనకు కరోనా సోకడంతో... ఆ వ్యాధి ఎలాంటిదో అనుభవం ద్వారా తనకు తెలిసిందన్న ట్రంప్... అక్కడితో ఆగకుండా... ఓ సెన్సేషనల్ కామెంట్ పెట్టారు. మాములుగా సీజన్‌లో వచ్చే జ్వరం కంటే... కరోనా ఏమంత ప్రాణాంతకం కాదని అయన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఒకరకంగా ప్రజలను తప్పుదారి పట్టించేది కావడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్... అప్రమత్తం అయి ఆ పోస్టును తొలగించాయి. "ఫ్లూ జ్వరం సీజన్ వస్తోంది. వ్యాక్సిన్ ఉన్నా... ఏటా లక్ష మందికి పైగా సీజనల్ జ్వరాలతో చనిపోతున్నారు. అందుకని మనం మన దేశాన్ని మూసేసుకుంటున్నామా (లాక్‌డౌన్ చేసుకుంటున్నామా)... లేదు కదా... మనం సాధారణ జ్వరంతో జీవించడం ఎలా నేర్చుకున్నామో... అలాగే కరోనాతోనూ జీవించడం నేర్చుకోవాలి. చాలా చోట్ల కరోనా ప్రాణాంతకంగా లేదు" అని ట్రంప్ మరో ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది. ఐతే ఈ ట్వీట్ ను ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం చూసే వీలు కల్పిస్తున్నట్లుగా ట్విట్టర్ తెలిపింది.
ఇది ఇలా ఉండగా తనకు కరోనా తగ్గిపోయిందని ట్రంప్ చెబుతున్నా... ఆయనకు నెగెటివ్ వచ్చిందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ట్రంప్ ఇలా హడావిడిగా వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ నుండి వెనక్కి వచ్చేయడానికి కారణం... అధ్యక్ష ఎన్నికలో భాగంగా అక్టోబర్ 15న ట్రంప్ తన ప్రత్యర్థి జో బిడెన్‌తో రెండోసారి డిబేట్‌లో పాల్గొనాల్సి ఉంది. దీనికోసం అయన సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరో పక్క వైట్‌హౌస్‌లో ట్రంప్... మాస్క్ పెట్టుకోకుండా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా అంత ప్రాణాంతకం కాదన్న ట్రంప్ కామెంట్లను అయన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్ తప్పుపట్టారు. ఇదే మాట... కరోనాతో చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి చెప్పాలన్నారు. జో బిడెన్ వేసిన ఈ కౌంటర్ ట్రంప్‌కి పెద్ద షాకే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఐతే ట్రంప్ తీరుతో ఇప్పుడు వైట్ హౌస్‌లో చాలా మంది సిబ్బందికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. తాజాగా వైట్ హౌస్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ తనకు కరోనా సోకినట్లుగా వెల్లడించారు.