English | Telugu
వరద సాయం నిలుపుదలతో మండిపడుతున్న హైదరాబాదీలు
Updated : Nov 18, 2020
అయితే జీహీచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో వరద సాయం కొనసాగించవచ్చని పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా వరదసాయం నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వరదసాయం పంపిణీకి హఠాత్తుగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరద సాయం పొందేందుకు మీ సేవా కేంద్రాల వద్ద నగర ప్రజలు వందల కొద్ది బారులు తీరారు. అయితే ఉన్నట్టుండి వరదసాయం నిలిపివేసినట్లు వార్తలు రావడంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో రోడ్డుపై మహిళలు బైఠాయించారు. అలాగే రాంనగర్‌లో సిటీ బస్సులను వరద బాధితులు నిలిపివేశారు. ఇక మరికొన్ని చోట్ల మీ- సేవా సెంటర్లను మూసివేసినా కూడా ప్రజలు కదలకుండా అక్కడే నిరసనకు దిగారు. ఇక వనస్థలిపురంలో తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తామని చెప్తేనే మూడు రోజులుగా తిండి కూడా లేకుండా ఎండలోనే క్యూలైన్లో ఉన్నామని ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నికల ప్రకటన చేసే సమయంలోనూ ఎన్నికల కమిషనర్ అప్లై చేసుకోవచ్చని చెప్పిందని, అయితే ఇప్పుడిలా మాట మార్చేస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అసలే వరదలతో సతమతమయ్యాం.. తినేందుకు సరుకులు కూడా లేని పరిస్థితిలో సర్కార్ సాయం చేస్తామనటంతో నమ్మి లైన్లో నిలబడ్డామని, ఇప్పుడు తీరా సాయం అందే సమయానికి ఎన్నికలయ్యే వరకు ఆగాలనడం సరైంది కాదంటున్నారు. మరి కొంతమందైతే మూడు రోజులుగా లైన్లో ఉంటే గురువారానికి టోకెన్ వచ్చిందని, ఇప్పుడు కాదు పోమ్మంటే మా నాలుగు రోజుల కష్టం బూడిదలో పోసినట్లు అవుతుందని సర్కార్ తీరుపై మండిపడుతున్నారు.